బ్రహ్మోత్సవాల వేళ దర్శనాల పై TTD కీలక నిర్ణయం- భక్తులకు ప్రత్యేక సూచనలు..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. భక్తుల క్యూ లైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది. కాగా.. శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల వేళ సేవలు.. దర్శనాల పైన టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేస్తోంది.
తిరుమలలో ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాలికట్ల బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు తిరుమలలో అన్ని రకాల ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసారు. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది.

తిరుమలలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను పూర్తిగా నిలిపివేయనున్నారు. వీటితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు కల్పించే ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేశారు. ఈ మార్పులను భక్తులందరూ గమనించి, టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
14వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14, 15 నుంచి 23 తేదీల వరకు ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవని టీటీడీ స్పష్టం చేసింది. బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ 10 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నారు. గరుడసేవ రోజున గతేడాది 6.13 లక్షల మందికి అన్నప్రసాదం అందించగా, ఈసారి 9.30 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి నుంచి తిరుమలకు 15 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నారు.














Click it and Unblock the Notifications
