TTD: తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం, వసతి పైన టీటీడీ కీలక ప్రకటన..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రావణ మాసం.. వరుస సెలవులతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. టోకెన్ లేని భక్తులకు దర్శనం కోసం 20 గంటల సమయం పడుతోంది. కాగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు దర్శనం.. వసతి విషయంలో తాజాగా కొన్ని ఘటనలు వెలుగులోకి రావటంతో టీటీడీ అలర్ట్ అయింది. దర్శనం.. వసతి పైన కీలక ప్రకటన చేసింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించవద్దని కోరింది. టిటిడి అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా మరియు టోకెన్ జారీ కౌంటర్ల ద్వారా నమోదు చేసుకుని దర్శనం పొందాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తామని ఇద్దరు వ్యక్తులు రూ 90,000 తీసుకుని మోసం చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణలో సదరు నిందితులు హైదరాబాద్ జంట నగరాల లో పలువురిని ఇలాగే మోసం చేసినట్లు గుర్తించారు. ఈ ఇద్దరు టీటీడీ ఉద్యోగులు కాదని.. వీరికి టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని టీటీడీ స్పష్టం చేసింది.

అదే విధంగా భక్తుల నుండి తరచూ నకిలీ దర్శన టికెట్ల బుకింగ్‌పై టిటిడికి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొంది. శ్రీవారి దర్శనం, వసతి కోసం అనధికార వెబ్ సైట్ లను ఆశ్రయించి వద్దని, టిటిడి వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. టిటిడి సేవలకు సంబంధించి https://ttdevasthanams.ap.gov.in , ttdevasthanams మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్డు ఆధారంగా బుక్ చేసుకోవాలని టిటిడి సూచించింది. టిటిడి సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించాలని భక్తులకు సూచన చేసింది. ఇదే సమయంలో దళారుల అక్రమాలపై భక్తులకు టిటిడి పలు ప్రసార, ప్రచార మాధ్యమాల్లో అవగాహన కల్పించేందుకు టిటిడి చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications