TTD: సిఫార్సు లేఖలు రద్దు - సామాన్యులకు సంతృప్తికర దర్శనం..!!
Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అధికమాసం కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల వేళ బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు స్వీకరించబోమనని టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
తిరుమలలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెండు సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల వేళ వీఐపీలకు ప్రాధాన్యత తగ్గిస్తూ సాధారణ భక్తులకు అవకాశం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన కరుణాకర రెడ్డి వెల్లడించారు. బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు స్వీకరించబోమన్నారు. రెండు బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారని వివరించారు. ముఖ్యంగా సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తామని తెలిపారు.

బ్రహ్మోత్సవాల వేళ బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు స్వీకరించమని ఛైర్మన్ తేల్చి చెప్పారు. ఇప్పటికే శ్రీవారి దర్శన విధానంలో టీటీడీ కొన్ని మార్పులు చేస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయం వేళలను మార్పు చేయటంతో సాధారణ భక్తులకు ప్రాధాన్యత దక్కుతోంది. ప్రస్తుతం నడక మార్గంలో అమల్లోకి వచ్చిన నిబంధనల కారణంగా నడక దారి భక్తుల సంఖ్య తగ్గింది. మొక్కులు ఉన్నవారు మెట్ల మార్గంలో తిరుమల చేరుకుంటున్నారు. దివ్య దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు సైతం రోడ్డు మార్గంలో తిరుమల చేరుకొని దర్శనానికి వెసులుబాటు కల్పించారు. దీంతో, బస్సుల ద్వారా తిరుమల చేరుకొని భక్తులు దివ్య దర్శనం చేసుకుంటున్నారు. నడక మార్గంలో భక్తుల రక్షణకు టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications