TTD: తిరుమలలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు, ఆ సేవలు రద్దు చేసిన టీటీడీ
Tirumala:కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో ఆగస్టు 27వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి, ఆగస్టు 28వ తేదీన ఉట్లోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
శ్రీ వేంకటేశ్వరస్వామిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆగస్టు 27వ తేదీన రాత్రి 8 గంటల నుండి 10 గంటల నడుమ శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం, ద్వాదశారాధన నిర్వహిస్తారు.

అనంతరం ప్రభంద శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేపడతారు.
ఆగస్టు 28వ తేదీన తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 28వ తేదీ న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
శ్రీకృష్ణజన్మాష్టమి గోగర్భం డ్యామ్ వద్ద ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని గోగర్భం డ్యామ్ వద్ద ఆగస్టు 27వ తేదీన గోకులాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడి ఉద్యానవనంలో వెలసిన కాళీయమర్ధనుడైన శ్రీకృష్ణునికి ఉదయం10.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకం, నైవేద్యం సమర్పిస్తారు. ఈ సందర్భంగా అన్నదానం, ఉట్లోత్సవం నిర్వహించడానికి టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
శ్రీకృష్ణజన్మాష్టమి సందర్బంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. శ్రీకృష్ణజన్మాష్టమి సందర్బంగా తిరుమలలోని బస్ స్టాండ్, క్యూలైన్ల పరిసర ప్రాంతాల్లో కూడా సోమవారం, మంగళవారం ప్రత్యేకంగా అన్నప్రసాదాలు పంపిణి చెయ్యడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీకృష్ణజన్మాష్టమి తిరుమల చేరుకునే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, పాలు, అల్పాహారం అందించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications