తిరుమలలో అవి విసరొద్దు- టీటీడీ
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 78,288 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 32,079 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.67 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేసే ఏర్పాట్లు చేసింది.
కాగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో పచ్చదనాన్ని 80 శాతం పెంచేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలలోని గోగర్భం డ్యామ్ సమీపంలో గల ఆక్టోపస్ భవనం వద్ద ఈ ఉదయం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 2,000 మొక్కలు నాటుతున్నామని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తోన్నామని, ఈ పుణ్యక్షేత్రాన్ని పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు పగడ్భందీగా ప్రణాళికలు అమలు చేస్తున్నాని అమన్నారు.
భక్తులు వాహనాల ద్వారా తీసుకొస్తున్న ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులను వాహనాల ద్వారా ఘాట్ రోడ్లలో విసురుతున్నారని, ఫలితగా అవి పేరుకుపోతున్నాయని వెంకయ్య చౌదరి అన్నారు. దీన్ని అడ్డుకోవడానికి అలిపిరి తనిఖీ కేంద్రం వద్దే ప్లాస్టిక్ ను నియంత్రిస్తున్నామని చెప్పారు.
భక్తులు తమ వాహనాల్లో నుండి ఘాట్ రోడ్లు, అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వస్తువులను విసరకూడదని సూచించారు. ఈ దిశగా వారికి అవగాహన కల్పిస్తోన్నామని పేర్కొన్నారు. తిరుమలలో ప్రతి చెట్టుకు ప్రాధన్యత ఉందని, విదేశీ మొక్కలు నాటడం ద్వారా స్వదేశీ చెట్లకు హాని కలుగుతుందని చెప్పారు.
అందులో భాగంగా పూర్తిస్థాయిలో పరిశోధన చేసి 40 స్థానిక మొక్క జాతులను గుర్తించి తిరుమలలో నాటుతున్నామని చెప్పారు. త్వరలో అటవీశాఖ సహకారంతో రెండు లక్షల మొక్కలను నాటుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కన్జర్వేటర్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications