తిరుమలలో ఆ కార్యక్రమం వేదిక మార్పు..: ఆర్జిత సేవలు రద్దు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. శుక్రవారం నాడు 61,613 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,291 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.12 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివుండలేదు. క్యూలైన్ల ద్వారా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీరు, పాలు అందజేశారు.

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ అధికారులు నేడు తిరుమలలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది తిరుమలలో. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వైభవోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు.
11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి వేంచేపు చేస్తారు.

సాధారణంగా వనభోజన కార్యక్రమం పార్వేట మండపంలో జరగడం ఆనవాయితీగా వస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసిన నేపథ్యంలో ఈ ఏడాది పార్వేట మండపానికి బదులుగా వైభవోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.
కాగా- ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీవారి అలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications