రూ.300ల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల తేదీ ఇదే
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. బాట గంగమ్మ ఆలయం వరకూ భక్తులు క్యూలైన్లల్లో వేచి ఉన్నారు. సర్వ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రతికూల వాతావరణంలోనూ తిరుమలకు పోటెత్తుతున్నారు భక్తులు.
గురువారం 63,628 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తుల్లో 33,548 మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. మొక్కులను చెల్లించుకున్నారు. హుండీ ద్వారా 4.26 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

ఈ పరిస్థితుల మధ్య శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.
ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే భక్తులు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

భక్తులు ఈ దర్శనం టికెట్లను టీటీడీ అధికారిక మొబైల్ యాప్ TTDevasthanams ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక తిరుమల, తిరుపతి, తలకోనల్లో వసతి గదుల కోటాను కూడా ఆ మరుసటి రోజున అంటే జులై 26వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి వసతి గదుల కోటా టికెట్లు అందుబాటులో ఉంటాయి.
అక్టోబర్ నెలలో సీనియర్ సిటిజన్లు/దివ్యాంగుల కోసం కేటాయించిన కోటా టికెట్లు ఒక రోజు ముందే అంటే ఈ నెల 25వ తేదీ నాడే విడుదల అవుతాయి. మధ్యాహ్నం 3:00 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఆయా టికెట్లన్నింటినీ కూడా అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications