TTD: దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనాల్లో పాత విధానం పునరుద్దరణ..!!
Tirumala: తిరుమల బోర్డు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనంలో పాత విధానంలోనే టోకెన్లు జారీ చేసే దిశగా నిర్ణయాలకు రంగం సిద్దం అవుతోంది. తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18న జరిగే టీటీడీ నూతన బోర్డు సమావేశం లో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు.
అలిపిరిలో కౌంటర్
టీటీడీ నూతన పాలక వర్గం తొలి సమావేశం ఈ నెల 18న జరగనుంది. ఈ తొలి భేటీలోనే పలు నిర్ణయాలు తీసుకొనేందుకు రంగం సిద్దమైంది. అందులో భాగంగా దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శన విధానంలో పాత విధానాలు పునరుద్దరించే అవకాశాలు ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులకు 2008లో దివ్య దర్శనం పేరిట టోకెన్లను ఇచ్చేవారు. అలిపిరి మార్గంలో రోజుకు 14 వేల టోకెన్లు, శ్రీవారి మెట్టులో 6 వేలు జారీ చేయాలని 2017లో నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ పేరుతో గతంలో వాటిని నిలిపేసింది.

గత విధానం తరహాలో
ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లను ఇస్తోంది. అలిపిరిలోనూ వీటిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా.. ఆర్థిక స్థోమత ఉన్నవారి కోసం గతంలో తిరుపతిలోని శ్రీనివాసంలో రోజుకు 1,500 చొప్పున స్పెషల్ ప్రవేశ దర్శనం ఎస్‌ఈడీ టికెట్లను జారీ చేసేవారు. ప్రతి ధర్మకర్తల మండలి సభ్యులకు రోజుకు 20 టికెట్లను ఇచ్చేవారు. గత పాలక మండలి ఈ విధానం రద్దు చేసింది. టీటీడీ ఛైర్మన్ కార్యాలయం నుంచి ఇచ్చే టికెట్ల సంఖ్యను పెంచారు. దీంతో అక్కడ ఒక్కో టికెట్ సుమారు రూ.3 వేలు (టికెట్ ధరతో కలిపి)గా విక్రయించేవారు. కాగా, ప్రస్తుత పాలక వర్గం గతంలోని టికెట్ల ప్రక్రియను పునరుద్ధరిస్తుందని తెలుస్తోంది.
శ్రీవాణి టికెట్ల కౌంటర్
తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలియజేశారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ ను ఆయన ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ ను కేటాయించారు. గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications