శ్రీవారి సేవకులపై టీటీడీ కీలక నిర్ణయాలు- ఇక అక్కడ కూడా
Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 56,078 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 17,539 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.48 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఎనిమిది కంపార్ట్ మెంట్టు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి 8 నుండి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.

శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ దిశగా టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవ వ్యవస్థపై తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జాయింట్ ఈవో వీరబ్రహ్మంతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు మరిన్ని సౌకర్యాలను అందించవచ్చని అన్నారు.
ఐఐఎం, రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖకు చెందిన ట్రైనర్లతో నవంబర్ లో శిక్షణకు సంబంధించి ఆడియో, వీడియో విజువల్స్, ట్రైనింగ్ మెటీరియల్ సిద్ధం చేయాలని అన్నారు. ఇదివరకే ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న గ్రూప్ సూపర్ వైజర్లు, ట్రైనర్లకు డిసెంబర్, జనవరిల్లో శిక్షణ ఇవ్వాలని చెప్పారు. వీటన్నింటిపై ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఈఓ సూచించారు.
శ్రీ వేంకటేశ్వర వైభవం, తిరుమల సమాచారం, సనాతన ధర్మం, విలువలు, మేనేజ్మెంట్, లీడర్ షిప్, సేవ తత్పరత తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. తిరుపతి, తిరుమలలో ఉన్న అశ్వినీ ఆసుపత్రి, ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు సేవ చేసేందుకు శ్రీవారి వైద్య సేవను త్వరలోనే ప్రారంభించాలని అనిల్ కుమార్ సింఘాల్ వివిధ ఆస్పత్రుల డైరెక్టర్లకు సూచించారు. ఇందుకు సంబంధించి శ్రీవారి వైద్య సేవా సెల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అన్నారు.
అదేవిధంగా ఎస్వీ గోసంరక్షణశాలలో కూడా శ్రీవారి సేవకులు గోసేవను చేయడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దేశంలోని టీటీడీ ఆలయాల్లో శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, కన్యాకుమారి, బెంగుళూరు లాంటి ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి ఆలయాల్లో మొదటి విడతగా దీన్ని ప్రారంభించాలని, తదనంతరం మిగతా ఆలయాల్లో కూడా దశలవారీగా శ్రీవారి సేవను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.












Click it and Unblock the Notifications