నరసాపూర్ నుంచి తమిళనాడుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ కు కొత్తగా ఈ రెండు స్టేషన్లల్లో హాల్ట్ సౌకర్యం
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.
తాజాగా నర్సాపూర్ నుంచి ట్యుటికోరిన్ (తూత్తుకుడి) ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొదటి రైలు సెప్టెంబర్ 7వ తేదీన పట్టాలెక్కనుంది. 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. దీనికి సంబంధించిన హాల్ట్ స్టేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ సైతం ప్రారంభమైంది.

సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రతి సోమవారం రాత్రి 11:30 గంటలకు ట్యుటికోరిన్ నుంచి బయలుదేరే నంబర్ 06019 ప్రత్యేక రైలు.. మూడో రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 12: 20 నిమిషాలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.
ఈ నెల 9, 16, 23, 30వ తేదీల్లో ప్రతి బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 06020 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 4:30 గంటలకు ట్యుటికోరిన్ చేరుకుంటుంది.
తుటిమేలూర్, కోవిల్ పట్టి, సత్తూర్, విరుధునగర్, మధురై, కొడైకెనాల్ రోడ్, డిండిగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, కుంభకోణం, మైలాడుథురై, చిదంబరం, తిరుపాద్రిపులియూర్, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మూర్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్ మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
ఇందులో కొత్తగా మరో రెండు స్టేషన్లు జత చేరాయి. తమిళనాడులోని పన్రూటి, నాయుడుపేటల్లో హాల్ట్ అవుతుందీ ఎక్స్‌ప్రెస్. చెన్నై ఎగ్మూర్ తర్వాత నేరుగా నెల్లూరులో ఆగే ఈ ఎక్స్‌ప్రెస్ ఇకపై నాయుడుపేటలో కూడా హాల్ట్ అవుతుంది. ట్యూటికోరిన్ నుంచి నరసాపూర్ వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం 3:18 నిమిషాలకు నాయుడుపేటకు చేరుకుంటుంది. 3:20 నిమిషాలకు బయలుదేరి వెళ్తుంది. నరసాపూర్ నుంచి ట్యూటికోరిన్ కు తిరుగుముఖం పట్టినప్పుడు అర్ధరాత్రి 12:03కు నాయుడుపేటకు చేరుకుని 12:05 నిమిషాలకు బయలుదేరి వెళ్తుంది.












Click it and Unblock the Notifications