బాబు తొలి సంతకం: 'టి' చిక్కుముళ్లు, ఇప్పట్లో డౌట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే దాని అమలు సాంకేతిక చిక్కులు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతానికి ఈ నిర్ణయం అమలు అంత సులభం కాదని, అనేక చిక్కుముడులు ఉన్నాయని అంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచడంవల్ల పెద్దగా ఇబ్బందులేమీ ఉండేవి కావంటున్నారు.
58 ఏళ్లకు రిటైర్ అయ్యేవారు... మరో రెండేళ్ల తర్వాత పదవీ విరమణ చేసేవారు. అలా కాకపోయినా తెలంగాణ ప్రభుత్వం కూడా పదవీ విరమణ వయసు పెంచినా అంతా సజావుగా సాగేదంటున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులు వేరు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన వ్యవహారం పెద్ద ప్రహసనంగా మారింది. ప్రస్తుతానికి జరిగిన తాత్కాలిక పంపిణీలో సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో, కొందరు తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్రలో అనివార్యంగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉద్యోగుల పంపిణీ పూర్తి కావడానికి మూడు నెలల నుంచి గరిష్ఠంగా ఏడాదివరకు పడుతుందని అంచనా. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ఇంకా ఖరారు కాలేదు. ఈలోపు చాలామంది పదవీ విరమణకు దగ్గరవుతున్నారు.
తెలంగాణలో పని చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు పెంపు వర్తిస్తుందా? ఆంధ్రప్రదేశ్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది? సీమాంధ్రకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులకూ 60 ఏళ్ల దాకా పని చేసే అవకాశం లభిస్తుందా? తాత్కాలిక కేటాయింపు ముగిశాక వారు తిరిగి తెలంగాణకు వచ్చేస్తే ఇక్కడి ప్రభుత్వం వారిని ఏం చేస్తుంది? ఇలాంటి అనేక అంశాలపై స్పష్టత కరువైంది. ఇవన్నీ చిక్కు సమస్యలుగా మారాయి.
రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో, లోకల్ క్యాడర్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల్లో స్థానికులెవరో, స్థానికేతరులెవరో నిర్ధారించాల్సి ఉంటుంది. దీనిపై అభ్యంతరాలను కూడా పరిశీలించి తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. ఇందుకు చాలా వ్యవధి పడుతుంది.
ఈ నేపథ్యంలో కేంద్రం తుది పంపకాలు పూర్తి చేసేంతవరకు చంద్రబాబు తన 60 ఏళ్ల పదవీ విరమణ విధానాన్ని అమలు చేయలేని పరిస్థితి ఉంటుంది. తరువాతే కొత్త విధానం అమలు చేస్తే సాంకేతిక సమస్యలను కూడా అధిగమించే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
కాగా, జూన్ నెలాఖరులోపు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో నాలుగు వేల నుంచి ఐదు వేల మంది రిటైర్ అవుతున్నారు. ఇందులో హైదరాబాద్‌లో పని చేస్తున్న వారే వెయ్యి మంది వరకు ఉన్నారు. జిల్లాలలో పని చేస్తున్న వారు ఎక్కడి వారు అక్కడే ఉంటారు కాబట్టి వారి విషయంలో ఎలాంటి సమస్య లేదు. హైదరాబాద్‌లో ఉన్న వారితోనే ఇబ్బంది. వీరికి శాశ్వత కేటాయింపు జరగనందున రెండేళ్ల పాటు పదవీ కాలం పొడిగింపు ఎలా వర్తింపజేయాలన్నది అధికారులకు అంతుబట్టడం లేదు.












Click it and Unblock the Notifications