కాఫీ కారణంగా ప్రాణాలు తీసుకున్న ఇద్దరు బాలికలు.. అసలు ఏంటా స్టోరీ ?
ఓ చిన్న పొరపాటు... తల్లిదండ్రులు ఏం అంటారో అనే భయం ఆ చిన్నారిని ఆందోళన లోకి నెట్టేసింది. క్షణికావేశంలో భయంతో తనతో పాటు తన స్నేహితురాలి ప్రాణాలను సైతం తీసుకునేలా దారి తీసింది. ఈ తీవ్ర విషాదానికి కారణం ఓ కాఫీ అంటే వినడానికి కూడా ఆశ్చర్యంగా అనిపించడం సహజమే. కానీ ఇద్దరు బాలికల నిండు ప్రాణాలను బలి తీసుకున్న కాఫీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
అసలు ఏం జరిగిందంటే..?
అనంతపురం జిల్లా టీ వీరాపురం గ్రామ సమీపంలోని దొణగంగమ్మ గుడి వద్ద ఉన్న నీటి కుంటలో పడి శ్వేత (11), మౌనిక (9) అనే చిన్నారులు మృతి చెందారు. స్నేహితుల దినోత్సవాన్ని ఉత్సాహంగా ప్రారంభించిన ఆ బాలికలు.. రోజు గడవక ముందే ప్రాణాలు తీసుకొని వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగల్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కాఫీ కారణంగానే..?
శ్వేత, మౌనిక ఇద్దరూ పక్క పక్క ఇంట్లోనే ఉండేవారు. శ్వేత తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా.. ఇంట్లోనే ఉన్న ఆమెకు కాఫీ తాగాలనిపించి గ్యాస్ స్టవ్ మీద కాఫీ పెట్టుకుంది. ఈ క్రమంలో కాఫీ పెట్టిన గిన్నె మాడిపోయింది. దీంతో తల్లిదండ్రులు వచ్చి చూస్తే తిడతారని భయపడిపోయిన శ్వేత ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
అయితే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లేముందు.. తన చెల్లితో తాను దోనగంగమ్మ కుంటలోపడి చనిపోతానని శ్వేత చెప్పినట్టు అంటున్నారు. అలా వెళ్లే క్రమంలోనే తనకు తోడుగా తన స్నేహితురాలైన మౌనికను కూడా శ్వేత వెంటపెట్టుకొని తీసుకెళ్లిందని భావిస్తున్నారు. కాగా పనుల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు విషయం తెలియడంతో హుటాహుటిన దోనగంగమ్మ కుంటకు చేరుకున్నారు.

కాగా కుంటలో దూకి బాలికల ఆచూకీ కోసం వెతికగా నీటిలో ఇద్దరు బాలికల మృతదేహాలు దొరికాయి. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క రోజు కూడా విడిపోకుండా ఉండే స్నేహితులు.. చివరికి అంతిమ ప్రయాణం కూడా కలసే చేసారని వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజానికే ఒక హెచ్చరిక అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు చేసే చిన్న తప్పులపై కఠినంగా స్పందించకూడదని సూచిస్తున్నారు. మన చర్యల వల్ల వారికీ భయాన్ని కాకుండా.. ఈ విధంగా ఆ పనిని పూర్తి చేయాలో నేర్పించాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications