అమిత్ షా ఆల్‌రెడీ రోడ్ మ్యాప్ ఇచ్చేశారుగా: జనసేనతో పొత్తుపై కుండబద్దలు కొట్టిన సోము
విశాఖపట్నం: గుంటూరు జిల్లా ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ స్పందించింది. జనసేన పార్టీ తమకు మిత్రపక్షమేనని స్పష్టం చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు ఉండబోవని బీజేపీ పేర్కొంది. మిగిలిన అన్ని విషయాలపైనా పవన్ కల్యాణ్- పార్టీ జాతీయ నాయకులతో మాట్లాడుతారని వివరించింది.
2024లో ఎదుర్కొనబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి బీజేపీ నుంచి రోడ్ మ్యాప్‌ను తీసుకుంటామని- ఇప్పటం బహిరంగ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేక ఓటును చీల్చనివ్వబోమని, దీనికోసం అవసరమైతే పొత్తుపై త్వరలోనే కీలక నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం జనసేన పార్టీ- బీజేపీతో పొత్తులో కొనసాగుతోంది. తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ ఎక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులపై సరైన నిర్ణయాన్ని తీసుకుంటామని వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తెర తీసినట్టయింది. బీజేపీతో పొత్తును కొనసాగిస్తున్నాననడానికి సంకేతంగా రోడ్ మ్యాప్ అనే పదాన్ని ప్రయోగించారాయన. టీడీపీతోనూ పొత్తు పెట్టుకుంటామనే సందేశాన్ని ఇచ్చారు.

ఇదే విషయం మీద బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ మధ్యాహ్నం ఆయన విశాఖపట్నంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనసేన పార్టీతో కలిసి రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాల్సి ఉంటుందంటూ తమ పార్టీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం జనసేనతో కలిసి సన్నద్ధం కావాల్సి ఉంటుందని పార్టీ అగ్ర నాయకత్వం తమకు సూచించిందని కూడా చెప్పారు.
దీనికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను రెండు నెలల కిందటే అమిత్ షా తిరుపతిలో ఇచ్చారని సోము వీర్రాజు అన్నారు. బీజేపీ-జనసేన కలిసి ఏపీలో అధికారంలోకి రావాల్సి ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారని, దీనిపై తమకు దిశా నిర్దేశం సైతం చేశారని చెప్పారు. దీనికి అనుగుణంగానే తాము రాష్ట్రవ్యాప్తంగా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని, ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించేలా మలచుకుంటున్నామని అన్నారు.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటోన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై క్షేత్రస్థాయిలో పోరాటం సాగిస్తోన్నామని సోము వీర్రాజు చెప్పారు. జనసేన పార్టీ తమ మిత్రపక్షంగానే ఉంటుందని పదే పదే సోము వీర్రాజు తేల్చి చెప్పారు. తమ మిత్రపక్ష పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్- బీజేపీ జాతీయ స్థాయి నాయకులతో అన్ని విషయాలపైనా చర్చిస్తారని సోము వీర్రాజు వివరించారు. అందరూ స్క్రిప్టులే చదువుతున్నారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Recommended Video
అందరూ స్క్రిప్టులు చూసే చదువుతారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అంతర్జాతీయ వేదికల మీద కూడా పేపర్‌ను చూసే ప్రసంగిస్తారని వ్యాఖ్యానించారు. ఈ నెల 19వ తేదీన ఛలో కడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటోన్న సమస్యలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరికి నిరసనగా రాయలసీమ రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications