170కి.మీ వేగంతో ఢీకొట్టారు: విజయవాడలో గగుర్పొడిచే యాక్సిడెంట్, తలలు ఛిద్రమై..
కేఎల్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
Recommended Video

విజయవాడ: అర్థరాత్రి పార్టీలు.. బైక్‌ల మీద షికార్లు.. యువత ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల మీద ఎంత అవగాహన కల్పిస్తున్నా.. యువతకు మాత్రం తలకెక్కట్లేదు. తాజాగా విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదం మరోసారి ఈ అంశాన్ని చర్చనీయాంశం చేసింది.
మద్యం మత్తులో అతివేగంతో బైక్ నడిపిన విద్యార్థులు.. డివైడర్ ను ఢీకొట్టి ప్రాణాలు విడిచారు. స్నేహితుడు ఇచ్చిన పార్టీకి వెళ్లి.. ఆదివారం తెల్లవారుజామున బైక్ తో రోడ్డెక్కారు. మత్తులో ఉండటంతో వేగం హద్దులు దాటింది. అంతే వేగంగా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

మృతుల వివరాలు:
హైదరాబాద్, మల్కాజ్‌గిరికి చెందిన పామూరు వెంకట శేషసాయి యశ్వంత్(21) కేఎల్ యూనివర్సిటీలో బీబీఎం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హృతిక్ చౌదరి(19)(హరియాణా) ఇతని స్నేహితుడు. శనివారం రాత్రి మిత్రుడి పుట్టినరోజు పార్టీకి హాజరయ్యేందుకు మరికొంతమందితో కలిసి వీరిద్దరూ ఎల్‌ఐసీ కాలనీకి వెళ్లారు.

తెల్లవారుజామున ప్రమాదం:
పార్టీ అనంతరం తెల్లవారుజామున 3.30 గం. ప్రాంతంలో అమన్ అనే స్నేహితుడికి చెందిన డ్యూక్ బైక్‌ను తీసుకుని శేషసాయి, యశ్వంత్ బయటకొచ్చారు. 3.37గం. సమయంలో మొగల్రాజపురంలోని మధుచౌక్ నుంచి జమ్మిచెట్టు సెంటర్ వైపు అతివేగంతో దూసుకెళ్లారు. ఈ క్రమంలో డివైడర్‌ను ఢీ కొట్టారు.

170కి.మీ వేగంతో:
170కి.మీ వేగంతో డివైడర్‌ను ఢీ కొట్టడంతో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. డివైడర్ మధ్యన విద్యుత్ స్తంభానికి అమర్చిన ఫ్యూజ్ బాక్స్ ను ఢీకొట్టడంతో ఇద్దరి తలలు చిధ్రమైపోయాయి. ప్రమాద సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. విద్యార్థుల మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయి కనిపించాయి.

నేత్రదానం:
కొడుకు చనిపోయిన దు:ఖంలోను యశ్వంత్ తల్లిదండ్రులు అతని నేత్రాలను దానం చేయడం గమనార్హం. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విద్యార్థులు ఫ్యూజ్ బాక్స్ ను ఢీకొట్టడంతో.. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో గాఢాంధాకరం అలుముకుంది.












Click it and Unblock the Notifications