ఇందిర చేసిందే: చర్చపై జగన్‌కి ఉండవల్లి కౌంటర్, లాజిక్
హైదరాబాద్: 1969లో ఇందిరా గాంధీ చేసిందే తాము చేశామని, అసెంబ్లీలో విభజన ముసాయిదా బిల్లు పైన చర్చ జరిగి తెలంగాణ ప్రజలకు కూడా ఎవరు దోచుకున్నారో అర్థం కావాలని కాంగ్రెసు పార్టీ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం అన్నారు. ఎపి జర్నలిస్టుల ఫోరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఎంపీలు హర్ష కుమార్, రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడారు. తాము పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పైకి వచ్చామన్నారు. తమపై అనేక రకాల విమర్శలు వచ్చాయన్నారు. అయితే ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం అధిష్టానంపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వారంతా మొదటి నుండి కాంగ్రెసు పార్టీలోనే ఉన్నారన్నారు. పార్టీలో తాము తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనదన్నారు. విభజన సమస్యలను పార్లమెంటులో చెప్పే అవకాశం తమకు ఇవ్వలేదని మండిపడ్డారు.

విభజనపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే అన్నారు. ముసాయిదా బిల్లుపై చర్చ జరిగితే విభజనకు అంగీకరించినట్లేనని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉండవల్లి కౌంటర్ ఇచ్చారు. చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్లు అనడం సరికాదన్నారు. బిల్లుపై చర్చ జరగాలన్నారు. చర్చ జరిగితే ఎవరు దోచుకున్నారో తెలంగాణ ప్రజలకు తెలుస్తుందన్నారు. ప్రతి సభ్యుడు సభలో మాట్లాడాలన్నారు.
విభజనతో ఇరు ప్రాంతాలకు జరిగే నష్టాన్ని చెప్పాలన్నారు. రాష్ట్రపతి పంపిన బిల్లును చించడం సరికాదన్న వ్యక్తి గతంలో గవర్నర్ కుర్చీని తోసేశారని ఉండవల్లి గుర్తు చేశారు. మీ ప్రాంత ప్రజల బాధ్యత మీదైతే, తమ ప్రాంత ప్రజాభీష్టం మేరకు తాము నడుచుకోవడం తమ బాధ్యత అన్నారు. ప్రజలకు నష్టం జరుగుతుందనే తాము విభజనను వ్యతిరేకిస్తున్నామన్నారు. 23 వరకు పార్టీలకతీతంగా పోరాడుదామన్నారు.
కాంగ్రెసు పార్టీ తడిగుడ్డతో తమ గొంతు కోసిందన్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. అఫిడవిట్లు ఇవ్వడం, పిటిషన్లు వేయడం అంటే సమైక్యవాదమనే అర్థమన్నారు. అసెంబ్లీ నుండి తెలంగాణ ముసాయిదా బిల్లు తిప్పి పంపితే చర్చ జరిగినట్లే అవుతుందన్నారు.
ఉండవల్లి లాజిక్
ఏ రాష్ట్రం విడిపోయినా అసెంబ్లీ అభిప్రాయం కావాల్సిందేనన్నారు. అసెంబ్లీకి సంబంధం లేకపోతే రాష్ట్రపతి అభిప్రాయం ఎందుకు కోరారని ప్రశ్నించారు. విభజన బిల్లుకు అసెంబ్లీ ఆమోదిస్తుందని ఎవరూ అనుకోవడం లేదన్నారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని రాష్ట్రపతి పరిగణలోకి తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. భద్రాచలం ఏ ప్రాంతంలో ఉండాలో అక్కడి ప్రజల మెజార్టీ అభిప్రాయం తీసుకోవాలన్నప్పుడు రాష్ట్రం విడిపోవాలన్నా మెజార్టీ ప్రజల అభిప్రాయం అవసరం లేదా అన్నారు.
23 దాకా మ్యాపులు, రూట్లు లేవు
జనవరి 23వ తేదీ దాకా పార్టీలకతీతంగా సమైక్యం కోసం పోరాడాలన్నారు. అప్పటి వరకు తమకు మ్యాపులు, రూట్లు ఏమీ లేవన్నారు. 23 తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అసెంబ్లీలో చర్చ జరిగితే ఎమ్మెల్యేలంతా పాల్గొనాలన్నారు. విభజనతో జరిగే నష్టాన్ని చెప్పాలన్నారు. చర్చ జరిగితే నిజాలు బయటకు వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications