సంతకంతో సరిపెట్టాలనుకుంటున్నారా?: ఎక్కడ మెగా డీఎస్సీ నోటిఫికేషన్?: ఏపీ నిరుద్యోగుల్లో మొదలైన ఆందోళన
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాలేదు. సర్కార్ ఇప్పుడిప్పుడే కదురుకుంటోంది. మంత్రులు తమ తమ శాఖలపై అవగాహనను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. అధికారంలోకి రావడానికి భారీగా హామీలను ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది. దీనికి అవసరమైన దారులను వెదుకుతోంది. ఇందులో భాగంగా- ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. వాటి విలువ 7,000 కోట్ల రూపాయలు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించే సమయంలో చంద్రబాబు అయిదు గ్యారంటీలపై సంతకాలు పెట్టారు. మెగా డీఎస్సీ, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచడం, అన్నా క్యాంటిన్ల పునుద్ధరణ, స్కిల్ సెన్సెస్ ప్రతిపాదనలపై సంతకాలు చేశారు.
ఇందులో మెగా డీఎస్సీ వ్యవహారం బెడిసి కొట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకూ నోటిఫికేషన్ వెలువడకపోవడం పట్ల చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో అసహనం వ్యక్తమౌతోన్నట్టవుతోంది. 16,347 ఉపాధ్యాయ పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ ప్రతిపాదనలపై చంద్రబాబు సంతకం చేయగా.. ఆ సంఖ్య చాలట్లేదంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు.
మెగా డీఎస్సీలో పొందుపరిచిన ఉపాధ్యాయ ఖాళీల సంఖ్యను పెంచాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. ఈ మేరకు అనంతపురంలో వందలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కారు. భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంకీర్ణ కూటమి ప్రభుత్వం అతి తక్కువగా, నామమాత్రంగా మెగా డీఎస్సీ కింద ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి పూనుకోవడం పట్ల భగ్గుమంటోన్నారు. కూటమికి అనంతపురం జిల్లా భారీ మెజారిటీ ఇచ్చిందని గుర్తు చేశారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలంటూ నినదించారు.












Click it and Unblock the Notifications