union budget 2026: కేంద్ర బడ్జెట్ పై ఏపీ ఆశల చిట్టా ఇదే .. నేరవేరుతాయా?
2026 - 27 కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో ప్రవేశపెడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ బడ్జెట్ పైన గంపెడు ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులు, రోడ్డు రవాణా, రైలు మార్గాల పైన, ఏపీ అనుకున్న అనేక కీలక ప్రాజెక్టులకు బడ్జెట్లో ఊతం లభిస్తుందని భావిస్తోంది.
బడ్జెట్ పై ఏపీ ఆశలు
కీలక ప్రాజెక్ట్ లు, విద్య, వైద్యం, పర్యాటకం, రైల్వే వంటి కీలక ప్రాజెక్టులకు ఏపీకి ప్రాధాన్యత ఉంటుందని ఏపీ ప్రభుత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే రాజధాని అమరావతి కి కేంద్రం ప్రత్యేక మద్దతు ఇచ్చి బడ్జెట్లో కేటాయింపులు చేస్తే బాగుంటుంది అన్న కోరిక ఏపీ ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది.

బడ్జెట్ లో రవాణా ప్రాజెక్ట్ ల కేటాయింపులపై ఆశలు
ఏపీలో పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులకు నిధులను విడుదల చేయడంతో పాటు, పోలవరం ప్రాజెక్టు పైన కేంద్రం శుభవార్త చెబుతుందని నమ్ముతుంది. రాజమహేంద్రవరం కాకినాడ కెనాల్ రోడ్డు దాని అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదన నేపథ్యంలో నిధులు కేటాయింపు జరుగుతుందని భావిస్తున్నారు. జాతీయ రహదారుల పైన అనుసంధాన మార్గాలు, అండర్పాస్ లు, పై వంతెన లకు నిధులు కేటాయించాలని కోరిన నేపథ్యంలో బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఆశిస్తోంది.
గోదావరి పుష్కరాలపై బడ్జెట్ కేటాయింపులు ఉంటాయా?
రాష్ట్ర ప్రభుత్వం. గోదావరి పుష్కరాల నిర్వహణ కుంభమేళా తరహాలో పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తున్న క్రమంలో దీనికోసం కూడా భారీగా నిధులు అవసరం. గోదావరి పుష్కరాలకు 4500 కోట్ల మీద కేటాయింపులు కావాలని ప్రాథమిక ప్రతిపాదనలు ఉన్న సమయంలో బడ్జెట్లో దీనికి కేటాయింపులు చేస్తారని ఆశాభావంతో ఉంది.
కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ లపైనా ఆశ
ఇక దశాబ్దాల కోరిక అయిన కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు నిధుల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వేళ ఈ రైల్వే ప్రాజెక్టుకు బడ్జెట్లో మోక్షం లభిస్తుంది అన్న ఆశాభావం కనిపిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులపైన ఆశలు ఉన్నాయి. రైతు సంక్షేమానికి, విద్యారంగానికి, జలవనరుల ప్రాజెక్టులకు ఏపీకి సముచిత స్థానం ఇస్తారని ఏపీ ప్రభుత్వానికి ఆశలు ఉన్నాయి.
విభజన హామీల అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు
ఏపీలో మరిన్ని ప్రభుత్వ పాఠశాలలకు పీఎం శ్రీ పథకాన్ని విస్తరించాలని, ఉప్పాడ తీర కోత నివారణకు 334 కోట్ల రక్షణ గోడ నిర్మాణానికి, మత్స్యకారుల కోసం కేటాయింపులు చేస్తుందని ఏపీ ఆశలు పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్ర ప్రాజెక్టులకు బడ్జెట్ ద్వారా కేటాయింపులు జరగాలని ఆశిస్తోంది. ఇవి మాత్రమే కాదు రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్ హామీల అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది.












Click it and Unblock the Notifications