విశాఖపట్నంకు తియ్యటివార్త వినిపించిన నరేంద్రమోడీ
విశాఖపట్నం ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తియ్యటి వార్తను వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మధురవాడలో యూనిటీమాల్ ఏర్పాటు చేయబోతోంది. దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా ఏపీలో విశాఖలో నిర్మించబోతున్నారు. తొలివిడతగా రూ.86 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. యూనిటీమాల్ కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు. మలివిడత నిధులను మార్చి లేదంటే ఏప్రిల్ నెలలో కేంద్రం విడుదల చేయనుంది.
మూడున్నర లక్షల చదరపు అడుగుల్లో
రుషికొండ బీచ్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్రం ఒడ్డున దీన్ని నిర్మిస్తారు. సముద్రాన్ని ఆనుకొని నిర్మించేలా తయారైన డిజైన్ అందరినీ ఆకట్టుకుంటోంది. విశాఖపట్నంలో ప్రధానమైన హోటల్స్, పార్కలు, రామానాయుడు స్టూడియోతోపాటు ఆర్కే బీచ్ కూడా దగ్గరగా ఉంటుంది. కేంద్రం అందించే నిధులను ఎటువంటి వడ్డీ లేకుండా 50 సంవత్సరాల్లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మాల్ కు సంబంధించిన నిధుల్ని సింగిల్ నోడల్ ఖాతాలో జమచేస్తారు. నేడో, రేపో టెండరు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. మూడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+4 తరహాలో నిర్మాణం జరుగుతుంది.

రాష్ట్రానికి 26 దుకాణాలు
రెండు అంతస్తుల్లో 62 దుకాణాలు ఉంటాయి. రాష్ట్రంలోని జిల్లాలకు 26 కేటాయించి, ఇతర రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 36 కేటాయిస్తారు. 600 నుంచి వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకో దుకాణం ఉంటుంది. మూడో అంతస్తు నుంచి సముద్రాన్ని చూసేలా వ్యూ ఏర్పాటు చేస్తారు. నాలుగో అంతస్తులో రెండు మినీ థియేటర్లతోపాటు కన్వెన్షన్ హాల్ కడతారు. బ్యాంకులు, ఫర్నిచర్ దుకాణాలు, ఫిట్ నెస్ కేంద్రాలు, ఎంటర్ టైన్మెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్ ఔట్ లెట్లు, రిటైల్ స్టోర్లు అందుబాటులోకి వస్తాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్పత్తులను ఈ మాల్ లో విక్రయిస్తారు.












Click it and Unblock the Notifications