ఏం చేద్దాం: ఏపీకి హోదాపై భేటీలు: తెలంగాణ అభిప్రాయమని వెంకయ్య!
న్యూఢిల్లీ: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి... ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలలో ఏది ఇవ్వాలనే అంశంపై ఢిల్లీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, సుజనా చౌదరిలు మంగళవారం నాడు చర్చలు జరిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌తో వెంకయ్య, జైట్లీ, సుజనలు మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తే ఏం ప్రయోజనాలు ఉంటాయో చర్చించారు. వాటిని పరిగణలోకి తీసుకొని ఆ లాభాలు కలిగేలా ప్యాకేజీ ఇవ్వాలా లేక హోదా ఇవ్వాలా నిర్ణయించనున్నారు.
విభజన చట్టంలో అమలు కానీ అంశాల పైన నోడల్ ఎజెన్సీగా హోంశాఖ చేపట్టాలని నిర్ణయించారు. రెండు వారాల్లోగా హోంశాఖ విభజన అంశాల పైన రెండు తెలుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం జైట్లీతో వెంకయ్య, సుజనలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

సత్వరమే, రెండు రాష్ట్రాల అభిప్రాయం: వెంకయ్య
కేంద్రమంత్రుల భేటీ అనంతరం వెంకయ్య నాయుడు విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల గురించి, పెండింగులో ఉన్న అంశాల గురించి తాము చర్చించామని చెప్పారు. హామీలు, విభజన చట్టాల విషయంలో సత్వర పరిష్కారం కనుగొనాలని తాము కోరామని చెప్పారు.
హోం సెక్రటరీని, జాయింట్ సెక్రటరీని కూడా ఆహ్వానించి, అన్ని అంశాలపై క్షుణ్ణంగా మాట్లాడామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం లేకుండా ఉన్న అంశాల పైన సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాల పైన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు.












Click it and Unblock the Notifications