సమైక్య పోరు విజయంతో ముగుస్తుంది: లగడపాటి
విశాఖపట్నం: సమైక్య పోరాటం విజయంతో ముగుస్తుందని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 21వ తేదీన విజయోత్సవ సభలు జరుపుకుంటామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఫిబ్రవరి 9వ తేదీన విశాఖ సముద్ర తీరంలో సమైక్య పరుగు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజనను అడ్డుకునే విషయంలో తమ సత్తా, బలం ఏమిటో చూపిస్తామని ఆయన అన్నారు. పార్లమెంటులో వేడి పుట్టిస్తామని, రాష్ట్ర సమైక్యతను కాపాడుకుంటామని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు ఉండేంత వరకు పోరాటాల ద్వారా వేడి పుట్టించాలని ఆయన సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

శాసనసభలో అందరూ ఏకగ్రీవంగా సమైక్యం కోసం నిలబడ్డారని, దాన్ని బలహీనపరచకూడదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో తిరిగి వస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, తాను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి ముందుకు రాని నాయకులను ప్రజలు శాశ్వతంగా ఇంటికి పంపిస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఇష్టానుసారం చేయడానికి వీల్లేదని ఆయన అన్నారు. విభజనను ఆపడానికి తమకు అనేక మార్గాలున్నాయని ఆయన అన్నారు. శాసనసభ్యులపై తెచ్చినట్లుగానే పార్లమెంటు సభ్యులపై కూడా ప్రజలు ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications