ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను ప్రశంసించిన యూఎస్ కాన్సులేట్ .. కారణం ఇదే !!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యూఎస్ కాన్సులేట్ అభినందనలు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఓకే రోజుల్లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం పై యూఎస్ కాన్సులేట్ ప్రశంసల వర్షం కురిపించింది. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పనిచేసిన వైద్య సిబ్బందిని అభినందించింది యూఎస్ కాన్సులేట్ . ఒకేరోజు 1.3 మిలియన్ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వటం మామూలు విషయం కాదు అంటూ కొనియాడింది. మీరు చేస్తున్న కృషి ప్రజల ప్రాణాలను కాపాడుతుంది అంటూ పేర్కొంది.
Congratulations to the state of Andhra Pradesh, AP health workers, and @ysjagan for your successful vaccination drive, including administering over 1.3 million doses in a single day! Your efforts are saving lives. https://t.co/9QsWrZU68g#Vaccine
— Joel Reifman (@USCGHyderabad) June 25, 2021
ట్విట్టర్ వేదికగా యూఎస్ కాన్సుల్ జనరల్ , జోయల్ రైఫ్ మన్ పేరుతో చేసిన ట్వీట్ లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించడంతో పాటుగా, ఏపీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు కితాబిచ్చారు. ఒకపక్క ఏపీలో ప్రతిపక్షాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని, వ్యాక్సినేషన్ కార్యక్రమం సరిగా కొనసాగటం లేదని విమర్శలు గుప్పిస్తున్నా అవేవి పట్టించుకోకుండా ఏపీ సర్కార్ ముందుకు వెళుతుంది.

ఏపీ ప్రభుత్వం ఒకేరోజులో 13, 26,271 వ్యాక్సిన్ డోసులు తో తన రికార్డును తానే తిరిగి రాసుకుంది. గతంలో ఏపీలో ఒకే రోజులో ఆరు లక్షల వ్యాక్సిన్ డోసులు యివ్వడం జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా ఉంది. ఇక ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఇటీవల మరో రికార్డ్ ను ఏపీ సర్కార్ సృష్టించింది. ఒకే రోజు రికార్డుస్థాయిలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన ఘనత దక్కించుకున్న ఏపీ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురి ప్రశంసలు అందుకోగా, తాజాగా యూఎస్ కాన్సులేట్ కూడా ఏపీ సర్కార్ పనితీరుకు కితాబిచ్చింది. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కొనియాడింది.












Click it and Unblock the Notifications