Tirumala: తిరుమలలో ఆ పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం..
వైష్ణవాలయాల సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరచి ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనానికి విశిష్టత ఉంది. వైకుంఠంలో శ్రీమహావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థమని పురోహితులు చెబుతున్నారు. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలు ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు ఇక్కడ 6 నెలలు దక్షిణాయణంగా పేర్కొంటారు.
వైకుంఠంలో తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానమని వివరిస్తున్నారు. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తామని.. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీమహావిష్ణువు దేవతలకు, ఋషులకు దర్శనమిస్తారని చెబుతున్నారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియగా పేర్కొన్నారు. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయాలలో ఈ 10 రోజులలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీమహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అనేది నమ్మకం ఉంది.

కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజులలో ఏరోజు చేసుకున్నా అన్ని రోజులూ సమానమేనని చెబుతున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు సూచించారు. గతంలో వలెనే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు పరిమితంగా మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ సమయంలో సిఫారసు లేఖలు స్వీకరిచలేమని స్పష్టం చేశారు.
వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజలు పాటు ఉంటుందని కావున వీఐపీలు, ఇతర భక్తులు తొలిరోజైన వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలనే తొందరపాటు లేకుండా పది రోజుల్లో ఏదో ఒకరోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. కాగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications