వాళ్లకు శవరాజకీయాలు అలవాటు: గీతాంజలిని హత్యచేసింది వైసీపీనే: వంగలపూడి అనిత!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు గీతాంజలి మృతి వ్యవహారం రాజకీయంగా రగడకు కారణంగా మారింది. తాజాగా గీతాంజలి మృతి కేసులో టిడిపి సోషల్ మీడియా కార్యకర్త రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో గీతాంజలి మృతిపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గీతాంజలిని హత్యచేసింది వైసిపి నే అని ఆమె ఆరోపించారు.
శవరాజకీయాలు చేయడం వైసిపికి అలవాటని, గతంలో ఎన్నికల సమయంలో బాబాయ్ హత్య, కోడి కత్తి డ్రామాలు చేసి రక్తి కట్టించారని, ఇప్పుడు గీతాంజలి మృతి వ్యవహారంలో కూడా శవరాజకీయాలు చేస్తున్నారంటూ వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. గీతాంజలి మృతి సమయంలో ఆమె వెంట ఉన్న ఇద్దరు పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదని వంగలపూడి అనిత ప్రశ్నించారు.

గీతాంజలిని గుర్తు పట్టని శవంగా రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే ఎందుకు ఉంచారో చెప్పాలని నిలదీశారు. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి మృతిని కూడా వైసిపి తమ రాజకీయం కోసం వాడుకుంటుంది అని వంగలపూడి అనిత అసహనం వ్యక్తం చేశారు. టిడిపి సోషల్ మీడియా ప్రచారం వల్లే గీతాంజలి చనిపోయిందని వైసిపి దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గీతాంజలి భర్తతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించింది వైసిపి వాళ్లు కాదా అని ప్రశ్నించిన వంగలపూడి అనిత, అసలు గీతాంజలి జీవితం అలా కావడానికి కారణం వైసిపి కాదా అంటూ మండిపడ్డారు. ఎనిమిది సంవత్సరాల గీతాంజలి కొడుక్కి ఐదు సంవత్సరాల నుండి అమ్మఒడి ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఆడబిడ్డలు చిత్తుచిత్తుగా ఓడించటం ఖాయమంటూ వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే గీతాంజలిది ఆత్మహత్య కాదని, ఎవరో ఆమెను బలవంతంగా నేట్టేశారని కూడా టీడీపీ ఆరోపిస్తుంది. అసలు గీతాంజలి మృతి వెనుక ఉన్నవారెవరో బయటకు రావాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. వైసీపీనే అంతా చేసి టీడీపీపై నెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడుతుంది.












Click it and Unblock the Notifications