వంగవీటి రాధాకు కీలక పదవి ఖరారు..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం 2025-26 పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. సూపర్ సిక్స్ లో రెండు పథకాల అమలుకు కేటాయింపులు చేసింది. ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్ధుల గెలుపు పైన కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే కోటా ఎన్నికలు జరుగుతన్నాయి. కూటమి కే అయిదు స్థానాలు దక్కనున్నాయి. అభ్యర్ధుల ఖరారు పైన చంద్రబాబు - పవన్ ఇప్పటికే ఒక విడత సమాలోచనలు చేసారు. కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కొత్త సమీకరణాలు
ఏపీలో అయిదు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమికే దక్కనున్నాయి. అందులో ఒక స్థానం జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబుకు దాదాపు ఖాయమైంది. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక సమయం లో చంద్రబాబు స్వయంగా నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కావటం లాంఛనంగానే కనిపిస్తోంది. తమకు ఒక సీటు కేటాయించాలని బీజేపీ నుంచి ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీకి ఒక సీటు కేటాయిస్తే మిగిలిన మూడు స్థానాలు టీడీపీకి దక్కనున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ సీటు కోసం 2024 ఎన్నిక ల్లో సీట్లు త్యాగం చేసిన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాధాకు ఛాన్స్
టీడీపీ నుంచి ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీకి సీటు కేటాయించేలా కసరత్తు జరుగుతున్నట్లు సమా చారం. టీడీపీ నుంచి బీసీ కోటాలో బీదా రవిచంద్ర పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మోపిదేవి సైతం రేసులో ఉన్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి యనమలకు అవకాశం లేదని పార్టీ నేతల సమాచారం. ఈ సమయంలోనే విజయవాడ కు చెందిన వంగవీటి రాధాకు ఈ సారి ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కుతుందని తెలుస్తోంది. 2019 ఎన్నిక ల సమయంలో రాధ వైసీపీ వీడి టీడీపీలో చేరారు. ఆ సమయంలోనే రాధాకు ఎమ్మెల్సీ పదవి పైన హామీ దక్కింది. కానీ, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటంతో రాధాకు అవకాశం దక్కలేదు.
తుది కసరత్తు
ఇప్పుడు కూటమిలో చంద్రబాబు తో పాటుగా పవన్ తోనూ రాధాకు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాధాకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే, నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తుండటంతో.. అదే వర్గానికి చెందిన రాధాకు ఇవ్వటం పైనే ఆలోచన జరుగుతుందని చెబుతున్నారు. ఇక.. పిఠాపురం వర్మకు పదవి పైనా చర్చ జరుగుతోంది. రాధాకు సీటు కేటాయిస్తే కృష్ణా జిల్లాకే చెందిన బుద్దా వెంకన్న, మాజీ మంత్రి దేవినేనికి ఛాన్స్ ఉండదని భావిస్తున్నారు. ఎస్సీ వర్గం నుంచి పశ్చిమ గోదావరికి చెందిన ఇద్దరు మాజీ మంత్రుల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. దీంతో.. కూటమి నుంచి ఖరారు చేసే అయిదుగురు అభ్యర్ధుల తుది ఎంపిక పైన ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications