సీఎం జగన్ పై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ముఖ్య నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. కూటమి వర్సస్ వైసీపీ అన్నట్లుగా ఎన్నికల సమరం కొనసాగుతోంది. ప్రధాని మోదీ ఈ నెల 7,8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 7న రాహుల్ గాంధీ ఏపీలో ప్రచారం చేయనున్నారు. ఇటు మూడు పార్టీల కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కీ.. నొక్కీ అలసిపోయారని.. మే 13వ తేదీన బటన్ నొక్కి ఆయన్ను ఇంటికి పంపిద్దామని వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమికి చెందిన కాపు నేతలు సమావేశంలో రాధా ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ సమావేశంలో కూటమి అభ్యర్థుల విజయం కోసం పని చేయాలని నిర్ణయించారు. మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉందన్నారు. బటన్ నొక్కి జగన్ అలసిపోయారన్నారు. కులాన్ని స్వార్థం కోసం వాడుకుని పదవులు పొందితే కొంతకాలమే ఉంటుందన్నారు. వంగవీటి రంగా మాత్రం ప్రజల కోసం నిలబడటం వల్లే ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు

ఇదే సమయంలో పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు వంగవీటి రాధాకృష్ణ. ఓట్లు చీలకూడదని పవన్ కల్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నారని వంగవీటి చెప్పారు. జగన్ రెడ్డి సిద్ధం అంటే జనసైనికులు సై అంటున్నారని.. కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యత అందరం తీసుకుందామని రాధా పిలుపునిచ్చారు. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలన్న నినాదాన్ని చాటిచెప్పాలన్నారు. ఇప్పటికే రాధా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్దులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ ప్రచారంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications