చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్‌ను అప్రమత్తం చేసిన వైసీపీ రెబెల్ ఎంపీ..!!
అమరావతి: రాష్ట్రంలో సంక్రాంతి సందడి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అదే రోజున భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఊర మాస్ మూవీస్ ఈ రెండు కూడా. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య.. ఒక్కరోజు తేడాతో విడుదల కానున్నాయి.

అదరగొడుతున్న వీరసింహా..
ఈ నెల 12వ తేదీన వీర సింహా రెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతిహాసన్ హీరోయిన్. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఇటీవలే ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. వీరసింహా రెడ్డి ట్రైలర్ అదరగొడుతోంది. బాలకృష్ణ మాస్ లుక్ లో కనిపించారిందులో. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్యకు కేఎస్ రవీంద్ర దర్శకుడు. రవితేజ ప్రత్యేక పాత్రను పోషించారు. శనివారమే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.

అఖండ తరువాత..
ఇవ్వాళ విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోనుంది చిత్రం యూనిట్. 13వ తేదీన వాల్తేర్ వీరయ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండూ కూడా భారీ బడ్జెట్ సినిమాలే. అదే స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు కూడా ఉన్నాయి. అఖండ తరువాత బాలకృష్ణ నటించిన మూవీ వీరసింహారెడ్డి. అఖండ సూపర్ హిట్ గా నిలిచింది. ఆచార్య తరువాత చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేర్ వీరయ్య. ఆచార్య మూవీ గ్రేట్ డిజాస్టర్. మెగాస్టార్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది సినిమా.

హైప్ క్రియేట్..
దీనితో వాల్తేర్ వీరయ్యపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి అనుగుణంగా ట్రైలర్ టాక్ అదరగొట్టింది. పూల చొక్కా, గళ్ల లుంగీలో మెగాస్టార్ ప్యూర్ మాస్ లుక్స్ లో కనిపించారు. ఆయనకు తోడుగా మాస్ మహారాజా రవితేజ కూడా తెరను పంచుకోవడం సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. అఖండతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ- వీరసింహా రెడ్డితో దాన్ని కొనసాగిస్తారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది.

రఘురామ కామెంట్స్..
ఈ రెండు సినిమాల విడుదల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తో్న నేపథ్యంలో- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రెండు సినిమాలను ప్రస్తావిస్తూ కొద్దిసేపటి కిందటే ఆయన తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో కామెంట్స్ పోస్ట్ చేశారు.

రెండు హిట్ కావాలి..
సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కానున్న వీరసింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య రెండు సినిమాలు హిట్ కావాలని రఘురామ కృష్ణంరాజు ఆకాంక్షించారు. అదే సమయంలో అభిమానులను అలర్ట్ చేశారాయన. తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు వేరే పేర్లతో తప్పుడు రివ్యూలు రాస్తారని వ్యాఖ్యానించారు. ఒకరి ఫ్యాన్స్ గా చెప్పుకుంటూ మరొకరిపై విమర్శలు గుప్పిస్తారు పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications