ఏం కొనేట్టు లేదు.. ఏం తినేట్టు లేదు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిస్తున్నాయి. ఇప్పటికే టమాటా ధర కొండెక్కింది. వాటి వెనకే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పరుగులు తీస్తున్నాయి. టమాటా రూ.120 నుంచి రూ.130 మధ్యలో ఊగిసలాడుతుండగా పచ్చిమిర్చి ఏకంగా కేజీ రూ.150 అయింది. రెండు కట్టల ఆకుకూర రూ.20 తీసుకుంటున్నారు. వీటివెనకే మేముకూడా ఉన్నామంటూ బీరకాయ, బెండకాయలు కూడా రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి.
నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద ఏయే కూరగాయలను సేకరించి రాయితీలపై ప్రజలకు విక్రయించవచ్చు అనే విషయంపై మార్కెటింగ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో హోల్ సేల్ కూరగాయల వ్యాపారులపై ప్రభుత్వం నిఘా పెట్టింది. కృత్రిమ కొరతను సృష్టించడానికి ప్రయత్నించేవారి వివరాలను సేకరిస్తున్నారు.

కేజీ టమాటా రూ.100 దాటింది. తెలంగాణలో రూ.130కి చేరింది. ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, కాన్పూర్ లాంటి నగరాల్లో కేజీ రూ.80 నుంచి రూ.100 మధ్య విక్రయాలు జరుగుతున్నాయి. కాన్పూర్ లో రూ.150కి చేరుకునే అవకాశం కనపడుతోంది. ఉల్లిపాయలు కేజీ రూ.34 చొప్పున విక్రయిస్తున్నారు. మొన్నటి వరకు రూ.100కు 6 కేజీల చొప్పులు అమ్మకాలు సాగాయి.
భవిష్యత్తులో ఇంకా ఎంత పెరుగుతుందో అనే ఆందోళనలో ప్రజలున్నారు. పచ్చిమిర్చి రూ.60 నుంచి ఏకంగా రూ.150కి పెరిగింది. కొనకుండానే ఇవి మంటెక్కిస్తున్నాయి. క్యారెట్, బీట్ రూట్, దొండకాయలు, బంగాళాదుంపలు కూడా నాలుగు రోజుల వ్యవధిలోనే పెరిగాయి. క్యారెట్ రూ.46, బీట్ రూట్ రూ.48, బంగాళాదుంపలు రూ.32, దొండకాయలు రూ.36 చొప్పున విక్రయమవుతున్నాయి.












Click it and Unblock the Notifications