ఎదుగు.. కానీ ఓపిక పట్టు: పవన్ 'రెండు' ప్రశ్నలకి వెంకయ్య ధీటైన జవాబు
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు సోమవారం నాడు ధీటైన కౌంటర్ ఇచ్చారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు సోమవారం నాడు ధీటైన కౌంటర్ ఇచ్చారు. ప్యాకేజీని రాత్రి ప్రకటించడంపై, దక్షిణాది పైన చిన్న చూపు అని పవన్ చేసిన ఆరోపణలపై స్పందించారు.
ప్యాకేజీ అర్ధరాత్రి ప్రకటనపై..
ప్రత్యేక ప్యాకేజీని ప్రజలు నమ్మడం లేదని, అందుకు కారణం ఉందని పవన్ కళ్యాణ్ మూడు రోజుల క్రితం అన్నారు. ప్యాకేజీని అర్ధరాత్రి ప్రకటించారని, అది సరైనదే అయితే అప్పుడు ప్రకటించడం ఏమిటని నిలదీశారు.
దీనిపై వెంకయ్య నాయుడు స్పందించారు. పాలన 24 గంటలు ఉంటుందన్నారు. అది నిద్రపోదని అభిప్రాయపడ్డారు. ప్రజలు నిద్రపోయినా 24 గంటలు పాలన కొనసాగుతుందన్నారు. ప్రకటన ఎప్పుడు చేశామన్నది అసలు సమస్యే కాదన్నారు.

పోలవరానికి వంద శాతం నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్ పైన సీఎం చంద్రబాబుతో చర్చించడం, విభజన హామీల మేరకు పలు సంస్థలు ఏపీకి కేటాయించడం.. ఇవన్నీ చేస్తున్నామని చెప్పారు.
ప్యాకేజీ పైన చంద్రబాబుతో చర్చించామని, ఆ తర్వాత ఆయన కొత్త సూచనలు చేశారని, ప్యాకేజీ పైన ఆర్థిక మంత్రితో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ప్రకటించామని తెలిపారు.
ఉత్తరాది - దక్షిణాదిపై..
దక్షిణాది వారిని చిన్న చూపు చూడవద్దని, ఉత్తరాది పెత్తనం వద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. దీనిపై కూడా వెంకయ్య స్పందించారు. ఉత్తరాది - దక్షిణాది అంటూ జనాన్ని రెచ్చగొట్టడం సరికాదన్నారు. దేశమంతా ఒక్కటే అన్నారు.
ఇలా మాట్లాడటం సంకుచిత మనస్తత్వమని, తాత్కాలిక భావోద్వేగాలు రెచ్చగొట్టి దాని వల్ల లబ్ధి పొందాలని చూడటమే అన్నారు. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో.. స్వాతంత్ర్యం వచ్చిన 69 ఏళ్లకు కూడా ఉత్తరాది - దక్షిణాది అంటూ వేరు చేసి మాట్లాడటం సరికాదన్నారు.
ట్విట్టింగే కాదు.. డూయింగ్.. ఓపిక పట్టు
హోదాకు అవకాశం లేదని, అది ముగిసిన అధ్యాయం అన్నారు. హోదాకు అవకాశముంటే ఇవ్వలేమా అని ప్రశ్నించారు. ఇన్ని ఇచ్చాం.. ఆ అపవాదు ఎందుకు పడతామన్నారు. ఇదే మాట ప్రధాని మోడీ చెబితే ఒప్పుకుంటారా అన్నారు.
ఏపీకి హోదాకు మించిన ఆదా లభించిందని, అభివృద్ధిలో దూసుకు పోతోందన్నారు. ఉద్యమాలు చేయడంలో తప్పు లేదు కానీ అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను చెడగొట్టవద్దన్నారు.
తప్పుడు ఉద్దేశాలు ఆపాదించవద్దని, ఆందోళనలు మొదలవ్వకముందే ఎంతో చేశామన్నారు. ట్విట్టింగే కాదు.. పని కూడా చేయాలని, అంచెలంచెలుగా ఎదగాలని, తాము 40 ఏళ్లు కష్టపడితే ఈ స్థితికి వచ్చామని, ఓపిక పట్టాలని, ఎదగాలని పవన్ కళ్యాణ్‌కు హితవు పలికారు.












Click it and Unblock the Notifications