కాంగ్రెస్‌పై వెంకయ్య నిప్పులు: పవన్‌కు బిజెపి థ్యాంక్స్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు కాంగ్రెసు పార్టీ పైన సోమవారం నిప్పులు చెరిగారు. ప్రజలు కాంగ్రెసు పార్టీని శిక్షించారని, తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విజయం సాధించామని, అందుకు కాంగ్రెసు పార్టీ నిత్యం మోడీని టార్గెట్ చేసుకోవడమేనని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండంకెలకు మించి సీట్లు రావని తాము ముందే చెప్పామన్నారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ కు ఇంతకంటే తక్కవ సీట్లు ఎప్పుడూ రాలేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ మిత్ర పక్షాలకు కూడా ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు. తమిళనాడులో ఎంతో పేరున్న డిఎంకె, ఉత్తర ప్రదేశ్‌లో బిఎస్పీలకు ఒక్క సీటు రాలేదని, ఎస్పీలో కుటుంబ సభ్యులు తప్ప ఎవరు గెలువలేదన్నారు. కాంగ్రెస్‌ను సమర్ధించిన వామపక్షాలు వాటి ఉనికిని కోల్పాయాయన్నారు. సిపిఐ పార్టీ జాతీయ గుర్తింపును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మోడీ వస్తే దేశానికి మంచి రోజులు వస్తాయని ప్రజలు నమ్మారని, అందుకే తమకు ఓటు వేశారన్నారు.
ఇక ప్రధానంగా ఈ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు తెరదించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రచారంలో ప్రధాని కనబడలేదన్నారు. తల్లీ, కొడుకు, కూతురు మాత్రమే ప్రచారం చేశారన్నారు. ఈ అంధకారం సమయంలో ఆశాకిరణంగా మోడీ కనిపించడంతో కాంగ్రెస్ పట్ల ప్రజలు కసిగా ఉన్నారన్నారని, నమ్మక ద్రోహాన్ని ప్రజలు సహించలేకపోయారన్నారు. రాహుల్ అహంకారం, అసమర్థతను కూడా భరించలేకపోయారని తెలిపారు. మోడీని వ్యక్తిగతంగా దూషించడం రాహుల్ అహంకారానికి నిదర్శనమన్నారు.

కుటుంబ పెత్తనానికి ప్రజలు తెరదించారన్నారు. కాంగ్రెసు పార్టీకి వచ్చిన సీట్లు బిజెపికి ఒక్క రాష్ట్రంలో వచ్చిన వాటి కంటే తక్కువ అన్నారు. పరనింద, ఆత్మస్థుతి వారి ప్రచారం అన్నారు. కాంగ్రెసు పార్టీ చరిత్రలో ఇంతకన్నా తక్కువ సీట్లు రాలేదన్నారు.
ఈసారి కనీసం ప్రతిపక్ష హోదాకూడా దక్కలేదన్నారు. ఈ తీర్పు కాంగ్రెసు పార్టీకి ఎంత వ్యతిరేకంగా ఉందో.. మిత్రపక్షాలకు అంతే ఉందన్నారు. డిఎంకె, ఎస్పీ, బిఎస్పీ, నేనషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీపీ, వామపక్షాలు తమ ఉనికిని కోల్పోయాయన్నారు. ఇప్పుడు దేశానికి రెండోసారి స్వాతంత్రం లభించినట్లయిందన్నారు. ఈ తీర్పు చారిత్రాత్మకమన్నారు.
పవన్‌ను కలిసిన బిజెపి నేతలు, ఎమ్మెల్యేల క్యూ
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను సీమాంధ్ర బిజెపి నాయకులు హరిబాబు, మాగంటి బాబులు సోమవారం మధ్యాహ్నం కలుసుకున్నారు. ఆయనకు వారు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇంటికి పలువురు ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో పవన్ టిడిపి, బిజెపి కూటమి తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ కూటమి నుండి గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయన ఇంటికి వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజులుగా పవన్ నివాసం ముఖ్యనేతలతో కిటకిటలాడుతోంది.












Click it and Unblock the Notifications