కేసీఆర్‌కి మళ్లీ మీడియా సెగ, మండిపడ్డ వెంకయ్య
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బుధవారం కూడా నిరసన సెగ తగిలింది. ఉదయం రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో నిర్వహించిన గ్రామీణ నీటి సరఫరా సదస్సులో పాల్గొన్న కేసీఆర్ ఎదుటే విలేకర్లు నిరసన తెలిపారు. విలేకర్లు నోటికి నల్ల రిబ్బెన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
తప్పుపట్టిన వెంకయ్య
మీడియాను తొక్కేస్తామనడం సరికాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు, మీడియా కలిసి పనిచేస్తేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు. మీడియా తప్పుచేస్తే చర్యలు తీసుకోవడానికి ప్రెస్‌కౌన్సిల్ లాంటి సంస్థలు ఉన్నాయన్నారు.

అరాచక పాలన: కిషన్ రెడ్డి
వరంగల్‌లో కేసీఆర్ వ్యాఖ్యలు బాధాకరమని, రాచరిక పాలనను తలపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మీడియాపై కత్తి దూయడం తప్ప వంద రోజుల పాలనలో కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. మహిళా జర్నలిస్టులపై దాడి బాధాకరమన్నారు. ఏ తప్పు చేయని చానళ్ల పైన కూడా నిషేధం ఎందుకని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం చేయని పాశవిక దాడిని కొనసాగిస్తున్నారన్నారు.
ఏబీఎన్, టీవీ9కు మిగతా చానళ్లు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కేసీఆర్ పార్టీలో చీలిక భయం పట్టుకుందన్నారు. మంత్రులను పని చేయనివ్వకుండా కేసీఆర్ కుటుంబం మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు 15వేల దరఖాస్తులు వచ్చాయని, 2500 ఇతర ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో రాష్ట్రంలో పాలనలో నైపుణ్యం లోపించిందన్నారు. సెప్టెంబర్ 17 పైన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ వద్దంటే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించరా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications