టీ, ఏపీలకు నిధులు తెస్తాం: వెంకయ్య, చంద్రబాబుకు కితాబు
నెల్లూరు/విజయవాడ: తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్ర నిధులు తీసుకు రావడంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. బీజేపీని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పైనా స్పందించారు. ఢిల్లీ ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదన్నారు. ఆందోళన అనవసరమని చెప్పారు. అంచనాలు తారుమారైనా కేంద్ర పనితీరుకు ఈ ఎన్నికలు నిదర్శనం కాదన్నారు. ఇప్పటి వరకు వచ్చినవి ఎగ్జిట్ పోల్ సర్వేలేనని, ఎగ్జాక్ట్ ఫలితాలు కాదని తనదైన శైలిలో స్పందించారు.
వెంకయ్యపై సీతారాం ఏచూరీ సెటైర్లు

కేంద్రమంత్రి వెంకయ్య పైన సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరీ సెటైర్లు వేశారు. విభజన సమయంలో గొంతు చించుకున్న నేతలు ఇప్పుడు మాట్లాడటం లేదని వెంకయ్యను ఉద్దేశించి విజయవాడలో అన్నారు. ఆర్డినెన్స్ పైన రాజ్యసభలో తేల్చుకుంటామని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కోసం పార్లమెంటులో పోరాడుతామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాట మారుస్తోందన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం కోసం భూములు తీసుకోవాలని, కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం లాండ్ పూలింగ్ విధానం అనుసరిస్తోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications