చిరుకు వెంకయ్య చురక, 'జగన్' అభ్యర్థి కూతురు అరెస్ట్
విజయవాడ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి యూపిఏ ఏం గౌరవం ఇచ్చిందని, ఆయన సహాయ మంత్రి అని, సహాయ మంత్రి అంటే అసహాయుడని అర్థమని బిజెపి నేత వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం విజయవాడలో మాట్లాడారు.
ఎంతమంది చిరంజీవులు వచ్చినా కాంగ్రెస్ మాత్రం చిరంజీవి కాలేదని, ఆ పార్టీ మృతజీవి అని వెంకయ్య అన్నారు. తొలుత కాంగ్రెస్ పైన మండిపడి... తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారని, మునిగే పడవలో కాలు పెట్టారన్నారు. చిరంజీవి కేంద్ర సహాయ మంత్రి కాదని, అసహాయమంత్రి అని వ్యాఖ్యానించారు.

లూటర్స్, చీటర్స్‌ను ప్రజలు నమ్మడం లేదన్నారు. తిరుపతి, విశాఖపట్టణంలో జరిగే సభల్లో నరేంద్ర మోడీతో కలసి పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. టిడిపికి వార్డు స్థాయి నుంచి కార్యకర్తల బలం ఉందన్నారు. టిడిపి, బిజెపి రెండూ కలిస్తే, రాష్ట్రం, దేశం అభివృద్ధిలో ముందుకు వెళతాయన్నారు.
ఎన్నికల తర్వాత కూడా టిడిపితో పొత్తు ఉంటుందన్నారు. లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ వంటివారు పార్లమెంటులో ఉండాలన్నది తన ఆకాంక్ష అన్నారు. అయితే పొత్తు ధర్మానికి కట్టుబడి మల్కాజిగిరిలో తమ మద్దతు టిడిపి అభ్యర్థికేనన్నారు. ధన, కుల బలం కాకుండా, వ్యక్తి గుణగణాలు చూసి ఓటేయాలని కోరారు.
డబ్బుతో పట్టుబడిన జగన్ కూతురు
అనంతపురం జిల్లా పుట్టపర్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి కుమార్తె సౌజన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుక్కపట్నంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఆమె 1.20లక్షల రూపాయలతో పట్టుబడ్డారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications