తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు? వెంకయ్య మరో షాకింగ్..!
తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష తెలుగుపై మమకారం చూపించే ప్రముఖుల్లో టాప్ లో ఉండే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి భాషపై తన అభిమానం చాటుకున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులు సైతం ఇంగ్లీష్ పై మక్కువ పెంచుకుంటున్న తరుణంలో ఇరు రాష్ట్రాలమ ముఖ్యమంత్రులకు ఆయన ఇవాళ ఓ కీలక సూచన చేశారు. దీంతో తెలుగు నేర్చుకునేందుకు సిగ్గుపడుతున్న వారికి షాక్ తగిలినట్లయింది.
తెలుగు చదువుకుంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ సూచించారు. బందరు కృష్ణా యూనివర్శిటీలో జరుగుతున్న కృష్ణాతరంగ్- 2025 కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఇవాళ తెలుగు భాషను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి తరం విద్యార్ధులు తెలుగును నిర్లక్ష్యం చేస్తుండటాన్ని వెంకయ్య తప్పుబట్టారు.

తాజాగా రామోజీరావు జయంతి సందర్భంగా తెలుగు భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు చేయాలని ఇద్దరు సీఎంలకు తాను సూచించినట్లు వెంకయ్యనాయుడు వెల్లడించారు. దీనికి వారు అంగీకరించినట్లు తెలిపారు. భారతీయ భాషల్ని కాపాడాలని ప్రధాని మోడీ ఆలోచిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. గతంలో ఆంగ్లేయులు వారి భాషను అధికార భాషగా మార్చి మనల్ని పాలించారని, మనం తెలుగువాళ్లం కాబట్టి తెలుగును పాలనా భాషగా చేయాలని వెంకయ్య సూచించారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు సైతం మాతృభాషల్లో బోధించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వెంకయ్య వెల్లడించారు. మన వాళ్లు ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోయినా పేపర్ మీద రాసుకుని మరీ మాట్లాడతారని, ఆంగ్లంలో మాట్లాడితేనే గొప్ప అని అనుకుంటున్నారని వెంకయ్య ఆక్షేపించారు. కానీ ముందు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని విద్యార్ధులకు వెంకయ్య సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications