ఆంధ్రుల నాయకుడిని కాదు: బాబుపై వెంకయ్య ప్రశంసలు, విజయవాడకు గడ్కరీ వరాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దార్శనికత, ముందుచూపు, పాలనపై అవగాహన ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో ఫ్లైఓవర్ల, రహదారుల నిర్మాణానికి శనివారం కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సిఎం చంద్రబాబునాయుడు, కేంద్ర, రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... అక్షర క్రమంలో మాదిరిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అత్యంత శక్తివంతంగా మారబోతుందన్నారు. చేసిన పనుల ద్వారా చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. కనకదుర్గ వారధి నిర్మించినవారిని జనం గుర్తు పెట్టుకుంటారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మున్ముందు అనేక ఓడరేవులు వస్తాయని తెలిపారు. ప్రపంచం ఆర్థిక మందగమనంలో నడుస్తోందని అన్నారు. ప్రపంచం యావత్తు భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని కుంభకోణాలేనని, వారిప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. విజయవాడలో మెట్రో రైలుకు కేంద్రం అనుమతిచ్చిందని చెప్పారు. విశాఖలో కూడా మెట్రో రైలు ఏర్పాటు చేస్తామన్నారు. గత మార్చిలోనే విజయవాడ అభివృద్ధి కోసం కేంద్రం రూ. 450 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. గుంటూరు డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ. 500 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

ఆంధ్రుల నాయకుడిని కాదు
తాను ఆంధ్రుల నాయకుడిని కాదని, ఇక్కడ్నుంచి తాను ఎన్నిక కాలేదని వెంకయ్యనాయుడు అన్నారు. తాను తెలుగు వాడ్ని అయినందుకు గర్విస్తున్నానని తెలిపారు. తెలుగుజాతి వెలిగిపోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్టీఆర్ తెలుగుజాతి వైభవాన్ని చాటి చెప్పారని అన్నారు. విభజన సమయంలో తెలుగువారి కోసం తాను పోరాటం చేశానని చెప్పారు.
అభివృద్ధి రాత్రికి రాత్రి జరగదని, అందుకు సమయం పడుతుందని అన్నారు. గత ప్రభుత్వం 50ఏళ్లలో చేయలేని పనులను తాము ఐదేళ్లలో చేసి చూపిస్తామని అన్నారు. అధికారం చేపట్టిన 15నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఏపిలో ఎన్జీరంగా విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశామని తెలిపారు.
అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రా, తెలంగాణే గుర్తొస్తాయని అన్నారు. తనకు తెలుగువారి ప్రయోజనం గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తనను రానీయకుండా అడ్డుకుంటామని కొందరు అంటున్నారని, అలా చేస్తే వారికేం ప్రయోజనం తెలియడం లేదని అన్నారు. మీడియాలో తన ఫొటో వచ్చి.. వారి ఫొటో రాకపోవడం వల్లే ఇలా చేస్తున్నారేమోనని అన్నారు.
విజయవాడలో బ్రిడ్జి నిర్మాణానికి సహకరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అన్నారు. ఏపి రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భూసేకరణ చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యం కాదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
భూమి లేకుండా విమానాశ్రయాలు, రైల్వేలు, రాజధాని నిర్మాణం చేపట్టే సాంకేతికత ఎవరిదగ్గరైన ఉంటే చెప్పాలని ప్రతిపక్షాలకు చురకంటించారు. ఎన్ని అడ్డంకులొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధిని కొనసాగిస్తారని అన్నారు. శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని చెప్పారు. ప్రధానిగా మోడీ లాంటి వ్యక్తి రావడం మన అదృష్టమని అన్నారు. వేషభాషలేవైనా మనమంతా భారతీయులమని, అన్ని మతాలను గౌరవించాలని వెంకయ్యనాయుడు అన్నారు.
గడ్కరీ వరాలు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విజయవాడపై వరాల జల్లు కురిపించారు. రూ. 20వేల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అంతేగాక, 13వేల కోట్లతో కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేపడ్తామన్నారు.
ఏపి సిఎం చంద్రబాబునాయుడు ఎన్డేయేకు అత్యంత సన్నిహితుడని గడ్కరీ అన్నారు. ఏపికి సహకరించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. చంద్రబాబు పాలనలో ఏపి దేశంలో టాప్-5లో నిలుస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.












Click it and Unblock the Notifications