టీకి హైదరాబాద్ ఆకర్షణ, ఎపికి బాబు: వెంకయ్య
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పనితీరును కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అభివనందించారు. ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞానఖనిగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకరిస్తుందని ఆయనఅన్నారు. ఆంధ్రాకు అన్ని కేంద్ర విద్యాసంస్థలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఐఐఎం విశాఖలో ఏర్పాటు కావటం మనకు ఎంతో పర్వదినంలాంటిదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
తెలంగాణాకు హైదరాబాద్ ఆకర్షణ అయితే ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణ అని ఆయన అన్నారు. పరిపాలనా దక్షుడైన చంద్రబాబును చూసి పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు. అభివృద్ధి, సుపరిపాలన కోసం మోదీని బలపర్చాలని వెంకయ్య కోరారు. విశాఖపట్టణం శివార్లలోని గంభీరంలో ఐఐఎం భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రులు స్మృతిరానీ, వెంకయ్యనాయుడు శనివారం శంకుస్థాపన చేశారు.

కొత్త ప్రభుత్వం వచ్చాక తొలి ఐఐఎం విశాఖలో ఏర్పాటు చేస్తున్నామని, విశాఖకు ఈరోజు పర్వదినమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖలో ఐఐఎం ఏర్పాటు చేయడం ఏపీకి గర్వకారణమని అన్నారు. భారతదేశ విజ్ఞాన గనిగా ఆంధ్రప్రదేశ్ పేరొందుతుందన్నారు. తెలంగాణకు హైదరాబాద్, ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్లు అని వ్యాఖ్యానించారు. ఎవరో ఏవో అన్నారని ఆందోళన చెందవద్దని, కేంద్రం నుంచి రాష్టానికి రావాల్సిన అన్ని వస్తాయని అన్నారు. చక్కని పరిసరాలలో విశాఖ ఐఐఎం ఏర్పాటు కానుందని వెంకయ్య పేర్కొన్నారు.
ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తోందని, భారత్‌లో పెట్టుబడులకు అందరూ ఆసక్తి చూపుతున్నారని మంత్రి వెంకయ్య అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సోవియెట్ తరహా సోషలిజాన్ని నమ్ముకొని దెబ్బతిన్నామని అన్నారు. పాలనలో ‘‘మేం రైటు కాదు.. లెఫ్ట్ కాదు.. స్టెయిట్''' అని వ్యాఖ్యానించారు. నేడు దేశంలో వామపక్ష భావజాలానికి ప్రజామోదం లేదని, ప్రజలకు కావాల్సింది అభివృద్ది అని ఆయన అన్నారు.
సుందర విశాఖనగరంలో ఐఐఎం ఏర్పాటుతో ఓ కొత్త శకాన్ని ఆరంభించుకుంటున్నామని కేంద్ర మానవ వనరుల విభాగం మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత కలలను సాకారం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. బెంగళూరు ఐఐఎం సహకారంతో విశాఖ ఐఐఎం పనిచేస్తుందని మంత్రి ప్రకటించారు.
తమ అమ్మ విశాఖలో నివసించిన రోజులు తనకు గుర్తుకువచ్చాయని అంటూ మంత్రి స్మృతి ఇరానీ తెలుగులో అందరికీ నమస్కారం చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. ఆన్‌లైన్ పాఠాలతో నామమాత్రపు ఫీజుతో సర్టిఫికెట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి స్మృతి ఇరానీ వివరించారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో నైపుణ్యం అభివృద్ధికి ప్రత్యేకంగా యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. ఉపాధ్యాయుల ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. విశాఖలోని యూనివర్శిటీ కేంద్రంగా ఐఐఎంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు ఆంభిస్తామన్నారు.












Click it and Unblock the Notifications