ఉద్యోగం రావాలంటే కండిషన్: ఏపీలో కేసీఆర్‌కు వెంకయ్య ప్రశంస, జగన్‌కు గడ్కరీ షాక్
అమరావతి: ఏపీలో పుట్టిన ప్రతి ఒక్కరు తెలుగు చదవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ విషయంలో చొరవ తీసుకున్నారని చెప్పారు.
అమరావతిలో ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు.

ఏపీలో ఉద్యోగం రావాలంటే
ఏపీలో ఉద్యోగం రావాలంటే తెలుగును తప్పనిసరి చేయాలని వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను తప్పనిసరి చేయడం సంతోషకరం అన్నారు. మాతృభాషను మరిచిపోయిన వాడు మనిషే కాదన్నారు. ఉద్యోగం కావాలంటే తెలుగు రావాలని కండిషన్ పెట్టాలన్నారు.
Recommended Video


ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కాదు
ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కాదని వెంకయ్య నాయుడు అన్నారు. కానీ మాతృభాషను మర్చిపోవద్దని చెప్పారు. అవసరం కల్పిస్తే ప్రతి ఒక్కరు తెలుగును నేర్చుకుంటారని చెప్పారు. అందుకే ఉద్యోగం కావాలంటే తెలుగు రావాలని కండిషన్ పెట్టాలని చెబుతున్నానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వెలగాలన్నారు.

నదులను కాపాడుకోవాలి
నదులను కాపాడుకోవాలని వెంకయ్య అన్నారు. నదులు మనకు సంబంధ అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు. జల రవాణాతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు.

నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఓ విధంగా సీఎం చంద్రబాబుకు ఊరటనిచ్చే ప్రకటన అని చెప్పవచ్చు. 2019కు ముందే పోలవరం పూర్తి కావడానికి సహకరిస్తామన్నారు. 2018లోనే పోలవరం పూర్తి చేస్తామని పదేపదే చంద్రబాబు చెబుతున్నారు. ఇది చంద్రబాబుకు ఊరట అని చెప్పవచ్చు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మా బలమని గడ్కరీ అన్నారు. పోలవరం నిర్మాణం వేగం పెంచుతామని చెప్పారు. ఏపీలో రహదారుల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు ఇస్తామన్నారు. రెండేళ్లలో 1.88 కోట్ల హెక్టార్లలో సాగుబడి పెంచుతామన్నారు.

జగన్, ఉండవల్లిలకు ఝలక్
2018లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు పలుమార్లు చెబుతున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరగడం లేదని పనులు చేస్తున్న కంపెనీ, అధికారులపై మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసిపి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు పోలవరం అనుకున్న సమయంలో పూర్తి కాదని బాబుపై నిప్పులు చెరిగారు. కానీ గడ్కరీ ప్రకటన జగన్, ఉండవల్లిలకు షాక్ కాగా, చంద్రబాబుకు ఊరట.












Click it and Unblock the Notifications