వివాదం ముగిసింది: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి
కడప: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపికలో స్పష్టత వచ్చింది. స్థానిక పెద్దలతోపాటు కొందరు మండల స్థాయి నాయకులు శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబసభ్యుల మధ్య జరిపిన చర్చలు ఫలించాయి.
బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా దివంగత పీఠాధిపతి పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. ఉత్తరాధికారిగా రెండవ కుమారుడు వీరభద్ర స్వామిని ఎంపిక చేశారు. భవిష్యత్ వారసులుగా రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ కుమారుల్లో ఒకరిని పీఠాధిపతిగా నియమించాలని నిర్ణయించారు.

శుక్రవారం ఉదయం నుంచి ఇరు కుటుంబాలతో జరిపిన చర్చల్లో అందరూ ఒక అంగీకారానికి వచ్చారు. కందిమల్లయ్యపల్లి సంస్థానంపుర ప్రజల సహకారంతో పీఠాధిపతి ఎంపిక జరిగింది. ఈ నిర్ణయాన్ని శనివారం కుటుంబసభ్యుల సమక్షంలో పెద్దలు ప్రకటిస్తారు. త్వరలో పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
కాగా, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి శనివారం దేవాదాయ శాఖ సంయుక్త ప్రాంతీయ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ రానున్నారు. మఠం ఆచారాలు, ప్రస్తుత పరిస్థితులు, కందిమల్లాయపల్లె గ్రామ ప్రజల అబిప్రాయాలను తెలుసుకుంటారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రికి దీనిపై నివేదిక ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications