కాబోయే లీడర్: బాబుకు కలిసొచ్చింది, పవన్ కళ్యాణ్‌తోనే బతుకులు బాగు!
న్యూఢిల్లీ/తిరుపతి: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పొత్తు వల్లే ఏపీలో తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత వి హనుమంత రావు సోమవారం నాడు అన్నారు. ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ సమీకరణాలు గమనిస్తే భవిష్యత్తులో కాపులే నాయకత్వం వహిస్తారని జోస్యం చెప్పారు. ఏపీలో కాపులే నాయకత్వం చేపట్టాలన్న వాదన వినిపిస్తోందని, తన అభిప్రాయం కూడా అదే అన్నారు.
ఇప్పటి వరకు రెడ్డి, కమ్మ కులాల నుంచి ఎందరో నాయకత్వం వహించారని, ఇప్పుడు కాపుల కాలం అన్నారు. రాష్ట్రంలో 28 శాతం ఉన్న కాపులు నాయకత్వం చేపడితే అభివృద్ధిలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశముందన్నారు.

పవన్ కళ్యాణ్ నాయకత్వం చేపడితే కులమతాలకు అతీతంగా అందరి బతుకులు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాపులకు బ్రిటిషన్ కాలంలో ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు లేకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిన తరగతుల్లో కాపులను చేర్చాలనడం న్యాయమైన కోరిక అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కాపులు అధికారంలోకి వస్తారన్నారు. విభజన సమయంలో తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని ధ్వజమెత్తారు. లోకసభలో విభజన బిల్లు ఆమోదం పొంది, రాజ్యసభకు వెళ్లే సమయంలో కేసీఆర్‌ను విలీనం విషయం గురించి పట్టుబట్టి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు.
డి రాజాను కలిసిన జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం వామపక్ష నేత డి రాజాను కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తప్పెటగుళ్ల వేషధారణలో ఎంపీ శివప్రసాద్
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టిడిపి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తప్పెటగుళ్ల వేషధారణలో పార్లమెంటు ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీ ప్రస్తుతం ఐసీయులో వెంటిలెటర్ పైన ఉందన్నారు. ఆంధ్రుల ఆగ్రహం బీజేపీకి శ్రేయస్కరం కాదన్నారు.












Click it and Unblock the Notifications