తిరుపతి లడ్డూ అపవిత్రం చేసిన ఘటనపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలి .దోషులను కఠినంగా శిక్షించాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు TTD EO ప్రకటనలను మరియు ల్యాబ్ రిపోర్టులను బట్టి కలుషితమైన మరియు అపవిత్రమైన నెయ్యిని తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడారని స్పష్ఠమవుతుంది, అందుకోసమే TTD పండితులు ప్రధాన ఆలయంతో పాటు లడ్డూ పోటు, లడ్డూ కౌంటర్లలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని మరియు మహాశాంతి యజ్జాన్ని నిర్వహించారు. వెంటనే నెయ్యి సరఫరా చేసిన కంపెనీల రికార్డులు మరియు TTD దిగుమతి చేసుకున్నప్పుడు జరిపిన రికార్డులు సీజ్ చేయాలి, వెంటనే FIR నమోదు చేయాలి, తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో జరిగిన అపచారం పై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో రోజువారి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనం తొలగించాలి. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి పూజ్య పీఠాధిపతులు,స్వామిజీల మార్గదర్శనంలో దేవాలయాల నిర్వహణ జరగాలి, అందుకోసమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చట్టాలు చేయాలని VHP డిమాండ్ చేస్తుంది. వన్ ఇండియా తెలుగుతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
పవిత్రమైన తిరుపతి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వినియోగిస్తున్నారనే వివాదం నేపథ్యంలో వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ వన్‌ఇండియాతో మాట్లాడారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని టీటీడీని, చంద్రబాబును ఆయన కోరారు. తొలుత ఈఓతో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడడం వల్ల పవిత్రత దెబ్బతింటోందని అన్నారని, ఇప్పుడు ఆ నెయ్యి ఎప్పుడూ వాడలేదని ఈఓ చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని గుర్తుచేశారు.

అదే నిజమైతే వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ బోర్డు స్పష్టత ఇవ్వాలని వీహెచ్‌పీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు ప్రమాదంలో పడ్డాయని ఆయన తెలిపారు. మరో 4 కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యిని కూడా పరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అసలు లడ్డూ తయారీలో వాడుతున్న అన్ని పదార్థాలను పరీక్షించాలని శశిధర్ డిమాండ్ చేశారు. ప్రసాదాల తయారీకి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లో వినియోగిస్తున్న పదార్థాలన్నింటినీ పరీక్షించాలని కోరతామన్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు చేస్తామన్న ఏపీ ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నామని, అయితే అధికారం మారితే సిట్ విచారణ తీరు కూడా మారిపోతుందని వీహెచ్పీ నేత శశిధర్ తెలిపారు. కాబట్టి భక్తుల్లో ఉన్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసేందుకు సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications