హామీల అమలుపై వెంకయ్య షాకింగ్ కామెంట్స్-టార్గెట్ జగనా ? చంద్రబాబా ? సర్వత్రా చర్చ
ఏపీ నుంచి రాజకీయాలు ప్రారంభించి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన రాజకీయ దిగ్గజం వెంకయ్యనాయుడు ఇవాళ కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. మాజీ జడ్పీ ఛైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు సంస్మరణ సభలో పాల్గొన్న వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబుగా సాగుతున్న రాజకీయాల నేపథ్యంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవన్న చర్చ జరుగుతోంది.

వెంకయ్య కామెంట్స్
దేశ రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్లు వేసే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ కృష్ణాజిల్లా మచిలీపట్నం పర్యటనలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత జడ్పీ ఛైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు సంస్మరణ సభలో పాల్గొన్న వెంకయ్య.. రాజకీయాల్లో ఎంతో కీలకమైన ఎన్నికల హామీలపై మాట్లాడారు.
ఎన్నికల హామీలు ఇస్తున్న నేతలు వాటిని తుంగలో తొక్కుతున్న రోజుల్లో పిన్నమనేని ఎలాంటి రాజకీయాలు చేశారన్న దానిపై వెంకయ్య ప్రశంసల వర్షం కురిపించారు. అదే సందర్భంగా ఏపీలో ఎన్నికల హామీల విషయంలో కీలక కామెంట్స్ చేశారు.

అమలయ్యే హామీలే ఇవ్వాలన్న వెంకయ్య
ఏపీలో ఎన్నికల హామీలపై మాట్లాడిన వెంకయ్యనాయుడు.. ఆచరణలో అమలయ్యే వాటినే ఇవ్వాలంటూ రాజకీయ పార్టీల నేతలకు చురకలు అంటించారు. ఈ విషయాన్ని అన్ని పార్టీలు గుర్తించుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు ఎన్నికల సందర్భంగా ఇస్తున్న హామీలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో వెంకయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాగే ఏపీలోనూ జగన్, చంద్రబాబు మధ్య హామీలపై నడిచే చర్చకు వెంకయ్య వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి.

జగనా ? చంద్రబాబా?
ఏపీలో అచరణకు అమలయ్యే హామీలే ఇవ్వాలంటూ నేతలకు వెంకయ్య నాయుడు చేసిన సూచన చూస్తుంటే ఇది జగన్, చంద్రబాబుల్లో ఎవరిని ఉద్దేశించి చేశారన్న చర్చ మొదలైంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు ఎన్నికల్లో 600కు పైగా హామీలిచ్చి అమలు చేయలేదని ఇప్పటికీ వైసీపీ ఆరోపిస్తుంటుంది.
అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మరీ వాటి స్ధానంలో నవరత్నాల హామీలు ఇచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆరంభంలో ఉన్న కాస్త నిధులతో హామీలు అమలు చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు వాటి విషయంలో కొత్త ఆంక్షలు పెట్టడంతో పాటు కొన్నింటిని వాయిదా వేస్తూ వస్తోంది కూడా. ఈ నేపథ్యంలో జగన్, చంద్రబాబుల్లో ఎవరిని ఉద్దేశించి వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై చర్చ మొదలైంది.

భాష కంట్రోల్లో పెట్టుకోవాలన్న వెంకయ్య
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ప్రత్యర్ధులపై దారుణమైన పదప్రయోగాలు చేస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని వంటి వారు ప్రత్యర్ధుల్ని ఏకవచనంతో తీవ్ర విమర్శలు చేస్తుంటారు. అలాగే అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో నేతలు భాషను అదుపులో ఉంచుకోవాలని వెంకయ్యసూచించారు. రాజకీయాల్లో స్ధాయి తగ్గిపోతోందనే భావన పెరుగుతోందని, నేతలు తమ భాషను సమీక్షించుకోవాలని వెంకయ్య కోరారు.












Click it and Unblock the Notifications