రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు - కీలక ఆధారాలు, ఇక..!!
ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అవినీతి పైన కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. ఇక.. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అవినీతి పైన విచారణ చేసిన విజిలెన్స్ ప్రభుత్వానికి ఈ రోజు నివేదిక సమర్పించనుంది. ఇందులో మాజీ మంత్రి రోజా.. అమె సోదరుడితో పాటుగా బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి పాత్ర పైన ఆరోపణలు ఉన్నాయి.
నివేదిక సిద్దం
'ఆడుదాం ఆంధ్రా' అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. ఈ రోజు ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందనుంది. 'ఆడుదాం ఆంధ్రా'లో దాదాపు రూ.40 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. వైసీపీ హయాంలో 'ఆడుదాం ఆంధ్రా' పేరిట వందల కోట్లు ఖర్చు చేసారు. గతంలో 'ఆడుదాం ఆంధ్రా'కు రూ.125 కోట్లు కేటాయించారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల కోసం కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అదనపు నిధులు కేటాయించినట్లుగా విజిలెన్స్ తేల్చినట్లు సమాచారం. అదే విధంగా విజేతలుగా వైసీపీ కార్యకర్తలనే ఎంపిక చేసినట్లు విజిలెన్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక.. కేవలం 47 రోజుల్లోనే భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లుగా విచారణ లో ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు.

కీలక ఆధారాలు
పబ్లిసిటీ కోసం 'ఆడుదాం ఆంధ్రా' క్రీడా సామగ్రిపై వైసీపీ స్టిక్కర్లు.. క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేసినట్లు విజిలెన్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. శాప్ నూతన చైర్మన్ బాధ్యతలు తీసుకునే పే 'ఆడుదాం ఆంధ్రా' వివరాలు డిలీట్ చేసినట్లు గుర్తించారు. మొత్తం రూ.40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. విజిలెన్స్ విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామస్థాయిలో క్రీడలకు రూ.10 వేలు కేటాయించి.. మరో రూ. పది వేలు జేబులో వేసుకుని.. ఖర్చు రూ. 20 వేలు చూపించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. 2023 డిసెంబర్‌లో ప్రారంభమైన 'ఆడుదాం ఆంధ్రా' ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్ స్టికర్లను భారీగా అంటించారు.
రోజా పాత్ర
ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త అధికారులు, మంత్రులు బాధ్యతలు తీసుకునే లోపలే వివరాలను డిలీట్ చేశారని విజిలెన్స్ తన నివేదికలో తెలిపినట్టు తెలిసింది. కాగా, ఈ అవినీతి సాగినకాలంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి మంత్రి రోజా, ఆమె సోదరుడితో పాటుగా శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి పాత్ర పైన ఫిర్యాదులు రావటంతో విజిలెన్స్ లోతుగా విచారణ చేసింది. పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. తమ నివేదికలో వారి పాత్రనూ విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో, ఇప్పుడు ఈ నివేదికలో ఏం చెప్పబోతున్నారు.. వీరి పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications