జగన్ ఇష్యూలో నాపై 13 కేసులు, ఆస్తులు రూ.17 కోట్లు: విజయసాయి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన విజయ సాయి రెడ్డి మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన అఫిడవిట్లో తన పైన ఉన్న కేసులు, ఆస్తులను ప్రస్తావించారు. విజయ సాయి రెడ్డి రాజ్యసభకు వెళ్తే.. వైసిపి నుంచి రాజ్యసభకు వెళ్లిన తొలి వ్యక్తి అవుతారు.
విజయ సాయి రెడ్డి అఫిడవిట్లో తన ఆస్తులతో పాటు తనపై నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థిగా ఆయన సోమవారం నాటికి మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. మంగళవారం తన సతీమణి సునందారెడ్డితో ఓ డమ్మీ నామినేషన్ కూడా వేయించారు.

ఈ క్రమంలో నామినేషన్‌తో పాటు తన ఆస్తులు, తనపై నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్ అందజేశారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ పైన నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో భాగంగా తనపై మొత్తం 13 కేసులు నమోదయ్యాయని అఫిడవిట్లో పేర్కొన్నారు.
తనకు, తన భార్య, కుటుంబ సభ్యులకు మొత్తం రూ.17.21 కోట్ల మేర ఆస్తులున్నాయని ప్రస్తావించారు. తనతో పాటు తన భార్య కూడా వ్యక్తిగతంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, టిడిపి నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపనందున ఏపీలో కూడా అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు.












Click it and Unblock the Notifications