రాజ్యసభ ఎన్నికల వేళ తెర పైకి సాయిరెడ్డి, లాస్ట్ మినిట్ లో..!?
రాజ్యసభ ఎన్నికలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. నేడు నామినేషన్లకు చివరి రోజు. దీంతో, కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి పేరు ఆకస్మికంగా తెర మీదకు వచ్చింది. జాతీయ మీడియా లో సాయిరెడ్డి రాజ్యసభ నామినేషన్ల పేపర్లను కొనుగోలు చేసినట్లుగా వచ్చిన వార్తలతో ఒక్క సారిగా కొత్త చర్చ మొదలైంది. అసలు ఏం జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
రాజ్యసభ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్. ఏపీలో రాజ్యసభ స్థానాలు కూటమికి ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనమే. టీడీపీ నుంచి ముగ్గురు.. జనసేన నుంచి ఒకరు రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసారు. కాగా.. అనూహ్యంగా ఇప్పుడు జార్ఖండ్ నుంచి జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలు ఆసక్తి కరంగా మారాయి. ఇక్కడ ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ - జేఎంఎం చెరో సీటు తీసుకునే విధంగా చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై.. పదవీ విరమణ చేసిన పరిమళ్ నత్వానీ జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక అయ్యేలా కసరత్తు మొదలు పెట్టారు. గతంలోనూ జార్ఖండ్ నుంచి పరిమళ్ నత్వానీ రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయన బరిలో దిగుతున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో భేటీ అయిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ అధికార ప్రతినిధి గౌరభ్ వల్లభ్, వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి జార్ఖండ్ రాజ్యసభ స్థానం కోసం నామినేషన్ పత్రాలు తీసుకోవటం సంచలనంగా మారుతోంది. మరో అయిదుగు సైతం ఈ సీటు కోసం పత్రాలు సేకరించారు.

సాయిరెడ్డి ప్రణాళికలు ఏంటి..?
గతంలోనే తాను ఎంపీ పదవికి, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. ఉన్నట్టుండి జార్ఖండ్ ఎన్నికల్లో నామినేషన్ ఫామ్స్ తీసుకోవడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటనేది సస్పెన్స్‌గా మారింది. నత్వానీకి ఎన్డీయే కూటమి పూర్తి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో విజయ సాయిరెడ్డి నామినేషన్ పత్రాల సేకరణ వెనుక అసలు లక్ష్యం ఏంటనేది చర్చగా మారుతోంది. జార్ఖండ్ లో క్రాస్ ఓటింగ్ తో పరిమళ్ నత్వానీ గెలుపు ఖాయం అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రాజ్యసభకు ఎన్నిక కావాలంటే తొలి ప్రాధాన్యత ఓటు గా 28 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. జార్ఖండ్ లో ఇండి కూటమికి 56 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏకు 24 మంది ఉన్నారు. రాజకీయ లెక్కలు.. క్రాస్ ఓటింగ్ సంగతి ఎలా ఉన్నా.. విజయ సాయిరెడ్డి నామినేషన్ పత్రాలు తీసుకున్నారనే నేషనల్ మీడియా కధనాలతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. సాయిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఎవరి కోసం ఈ పత్రాలు తీసుకున్నారు అనేది కీలకంగా మారుతోంది. దీని పైన సాయిరెడ్డి క్యాంపు నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.













Click it and Unblock the Notifications