కొత్త పార్టీ ప్రకటనపై నిర్ణయం మార్చుకున్న సాయిరెడ్డి - ఏం జరుగుతోంది..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్దం అవుతోంది. అటు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఇదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటు పైన వరుసగా ప్రకటనలు చేస్తూ వచ్చిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఇప్పుడు నిర్ణయం మారింది. పార్టీ ప్రకటనకు ముహూర్తం సైతం ఖరారు చేసిన సాయిరెడ్డి.. తాజాగా సోషల్ మీడియా వేదికగా కీలక అంశాన్ని వెల్లడించారు.
వైసీపీ వీడిన తరువాత సాయిరెడ్డి కొత్త పార్టీకి సిద్దమయ్యారు. దసరా తరువాతి రోజున పార్టీ ప్రకటన కు ముహూర్తంగా ఖరారు చేసారు. తన నూతన పార్టీ లక్ష్యాల పై విజయవాడ, అనంతపురం, విశాఖ తో పాటుగా తిరుపతిలోనూ మీడియా సమావేశాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ పైన మత పరమైన విమర్శలతో టార్గెట్ చేయటం రాజకీయంగా చర్చకు కారణమైంది. బీజేపీ, జనసేన విషయంలో మాత్రం సాయిరెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రకటనకు సిద్దం అవుతూనే పార్టీలోకి తన మిత్రుడు, టీటీడీ మాజీ సభ్యుడు ఓవి రమణను బహిరంగంగా ఆహ్వానించారు. గతంలో తాను, ఓవి రమణ నాలుగేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యులుగా కలిసి పనిచేశామని గుర్తుచేశారు. ఇప్పుడు తన కొత్త పార్టీలోనూ ఇద్దరం కలిసి పనిచేసి విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సాయిరెడ్డి ప్రకటన పై రాజకీయ చర్చ
తన కొత్త పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అసలైన అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. కాగా.. ఈ రోజు సోషల్ మీడియా వేదికగా సాయిరెడ్డి కీలక ప్రకటన చేసారు. అందులో.. పార్టీ ప్రకటన వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. సాయిరెడ్డి తన పోస్ట్ లో.."రేపటి నుంచి వారం రోజుల పాటు ఆయుర్వేద చికిత్స నిమిత్తం వెళుతున్నాను. స్థానికసంస్థల ఎన్నికల కోడ్ తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవ తేదీని ప్రకటిస్తాను.." అని పేర్కొన్నారు. అయితే... చాలా రోజులుగా సుదీర్ఘ కసరత్తు.. ముహూర్తం సైతం ఫిక్స్ చేసిన సాయిరెడ్డి ఇప్పుడు వాయిదా వేయటం పైన భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కొంత మంది సీనియర్ రాజకీయ నేతలు సాయిరెడ్డితో కలుస్తారని ఆయన మద్దతు దారులు చెబుతున్న సమయంలో.. ఇలా పార్టీ ప్రకటన వాయిదా వేయటం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications
