రెండున్నరేళ్లలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు.. ఏపీకి రండి అంటూ మంత్రి ఆహ్వానం!
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూ వేదికగా నిర్వహించిన 31వ సీఐఐ సన్నాహక ప్రాంతీయ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నాయని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 'సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్'కు ఈ ప్రాంతీయ సదస్సులు ప్రిపరేటరీ వర్క్‌షాప్‌లుగా ఉపయోగపడతాయని తెలిపారు. ఇక్కడ రూపొందించే నివేదికలను విశాఖ సమ్మిట్‌లో సమర్పిస్తామన్నారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యాటక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. నూతన పర్యాటక పాలసీ 2024-29, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా గత రెండున్నరేళ్లలో రూ.20,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని చెప్పారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో ప్రముఖ స్టార్ హోటళ్లు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు.
క్యారవాన్ టూరిజం, హోమ్‌స్టే, భూ కేటాయింపుల కోసం నూతన పాలసీలు అమల్లోకి వచ్చాయి. రిసార్టులు, హోటళ్లు ఏర్పాటు చేసే వారికి అవసరమైతే ఇతర శాఖల భూములను కూడా పర్యాటక శాఖకు బదిలీ చేసి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటక పెట్టుబడిదారులకూ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం వెంట యోగా, ఆయుర్వేద కేంద్రాలతో కూడిన వెల్‌నెస్ సెంటర్లకు అపార అవకాశాలున్నాయని వివరించారు.
కేరళలో జరిగిన జీటీఎం సదస్సులో ఏపీకి లభించిన 'బెస్ట్ టూరిజం ప్రమోషన్ అవార్డు' గొప్ప విజయమని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ప్రారంభించిన 'గోదావరి కాల్స్' కార్యక్రమాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో థీమ్ పార్క్‌లు, అడ్వెంచర్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్ వంటి ఎకో-టూరిజం ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
"ఏపీకి రండి.. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి. సులభతర భూ కేటాయింపులు, వేగవంతమైన అనుమతులు లభిస్తాయి. మీ పెట్టుబడులకు పూర్తి భరోసా ఇస్తాం. త్వరలోనే 'పర్యాటకాంధ్రప్రదేశ్' కలను సాకారం చేసి, ఏపీని ప్రపంచ స్థాయి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం" అని మంత్రి దుర్గేష్ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.













Click it and Unblock the Notifications
