Mysuru Dasara 2026: మైసూరు దసరా ఉత్సవాలు షురూ.. పూర్తి షెడ్యూల్ ఇదే..
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో విజయదశమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి.. తొమ్మిది అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది. శక్తి స్వరూణి, జగజ్జననిని, దుర్గామాతను నవరాత్రుల్లో విశేషంగా పూజిస్తారు. అయితే దసరా ఉత్సవాలు అన్ని ప్రాంతాలకంటే ఘనంగా వైభవంగా జరిపే ప్రాంతం కర్ణాటకలోని మైసూరు. మైసూరు దసరా ఉత్సవాలకు నాలుగు దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. ఓ వైపు భక్తి.. మరోవైపు కళ్లు మిరమిట్లుగొలిపేలా అంబరాన్నంటే సంబరాలతో ఏటా ఈ దసరాను రాష్ట్ర పండగగా నిర్వహిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా కనివినీ ఎరుగని రీతిలో దసరా సంబరాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
అక్టోబర్ 11న చాముండి కొండపై మైసూరు దసరా (నాడ హబ్బ) ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ దసరా ఉత్సవాలు అక్టోబర్ 21 వరకు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగనున్నాయి. అలాగే అక్టోబర్ 21 న చారిత్రక జంబూ సవారీ ఉండనుంది. ఈ వేడుకలో భాగంగా 750 కిలోల బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరీ దేవీ ఊరేగింపు ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే మైసూరు మహా నగరంలో ఎటు చూసిన కన్నుల పండుగగా మెరిసిపోయే మైసూరు ప్యాలెస్, మెగా డ్రోన్ షో, ఎయిర్ షోతో పాటు సంప్రదాయ కంబళ వంటి ఆకర్షణలు సందర్శకులను కట్టిపడేయనున్నాయి. మైసూరు దసరా ఉత్సవాలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు తరలివస్తున్నారు.
ఈ ఏడాది మైసూరు దసరా కీలక షెడ్యూల్ వివరాలు చూస్తే.. అక్టోబర్ 11 నుంచి 21 వరకు మైసూరు ప్యాలెస్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మైసూర్ ప్యాలెస్ ను దాదాపు లక్ష విద్యుత్ బల్బులతో పూర్తిగా బంగారు వర్ణంతో మెరిసిపోనుంది. అలాగే అక్టోబర్ 11 నుంచి 25 వరకు మహారాజా కాలేజీ గ్రౌండ్స్ లో కర్ణాటక సంప్రదాయ వంటకాలు, నోరూరించే మైసూరు పాక్ లతో ఆహార ఉత్సవం ఉండనుంది. దీంతోపాటు యువ దసరా పేరుతో అక్టోబర్ 13 నుంచి 17 వరకు ఉత్తనహెళ్లి గ్రౌండ్స్ లో సంగీత, సాంస్కృతిక కచేరీలు నిర్వహించనున్నారు. అలాగే మెగా డ్రోన్ షోలు, కంబళ పోటీలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

అయితే పర్యాటకుల కోసం KSTDC ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బెంగళూరు నుంచి వన్ డే, టూ డే సైట్ సీయింగ్ ప్యాకేజీలతో పాటు రాత్రి వేళల్లో నగరాన్ని వీక్షించేందుకు ఓపెన్-టాప్ 'అంబారీ డబుల్ డెక్కర్ బస్సు' టూర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక మైసూరు దసరా ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కర్ణాటక ప్రభుత్వ అధికారిక పోర్టల్ mysoredasara.gov.in ను సందర్శించవచ్చు.












Click it and Unblock the Notifications
