వైసీపీ విధానం, నినాదం ఒక్కటే: ప్రతిపక్షాలకు ఎంపీ సాయిరెడ్డి కౌంటర్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీలో ఎన్నికలు రాకముందే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల, మత రాజకీయాలపై ప్రతిపక్ష టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు అధికార వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉంటే వైసీపీ మంత్రులు, నేతలు ప్రతిపక్షాలపై రివర్స్ ఎటాక్ చేస్తున్నాయి.
తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. విపక్షాల కులం గొడుగు అయిపోయింది. ఇప్పుడు మతం ముసుగు కప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి అంటూ ఏపీలోని ప్రతిపక్ష టిడిపి, బిజెపి, జనసేనలను టార్గెట్ చేశారు. వైసీపీ విధానం, నినాదం ఒక్కటేనని పేర్కొన్నారు. జనులంతా ఒకే కుటుంబం - జనమంతా ఒకే నిలయం అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దిష్ట ఓటుబ్యాంకు లక్ష్యంగా చేసుకోవడం లేదని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 49.95% ఓట్లు రావాలంటే ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా ఓటర్లు సీఎంకు ఓటు వేయడం వల్లే సాధ్యమైందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు వివక్ష లేకుండా అందరికీ అందుతున్నాయన్నారు.
ఏపీ లోని ప్రతి ఒక్కరూ తమ ఓటు బ్యాంక్ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు గతంలో బ్రిటిష్ వారిలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు విభజించి పాలించాలన్న కాన్సెప్టుతో కులాలను, మతాలను రెచ్చగొట్టి నానా రచ్చ చేస్తున్నారని విమర్శించారు. విభజించి పాలించు అనే కాన్సెప్ట్ తో బ్రిటిష్ వారు కొన్ని కులాలను రెచ్చగొట్టేవారు.
అణగారిన, వెనుకబడ్డ వర్గాలను మరింతగా తొక్కేసేవారని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. రాజధానిలో వారుండరాదు. ఉంటే అడవుల్లో లేదా ఊరవతల ఉండాలనేవారు బ్రిటిషర్లు. ఆ అవశేషాలు ఇప్పుడు ఏపీలోని విపక్షాల్లో కనిపిస్తున్నాయి. 1947కు ముందు అది చెల్లింది. ఇప్పుడు కాదు అంటూ విజయసాయిరెడ్డి ప్రజల్లో మార్పు వచ్చిందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications