చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం: విజయసాయి రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దద్దమ్మలా వ్యవహరిస్తోందని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలితో విసిగిపోయిన ప్రజలు ఎప్పుడు ఆ ప్రభుత్వం పోతుందా అని ఎదురు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆయన శనివారంనాడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయడంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

ప్రత్యేక హోదాపై ఏం చేశారు..
ఎపికి ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఇంతవరకు ఏ విధమైన హామీ లేదని రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఉపయోగమని, పరిశ్రమలు వస్తాయని, ఈ విషయంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక హోదాతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారని, దానిపై ఇంకా ఏమీ చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. మన్నవరం విద్యుత్తు ప్రాజెక్టు కేవలం ప్రహారీకే పరిమితమై పోయిందని, కొత్త ప్రాజెక్టులు ఒక్కటి కూడా లేవని, సొంత జిల్లా అయిన చిత్తూరులో చక్కెర ఫ్యాక్టీర మూసేస్తామని రైతులకు చంద్రబాబు నోటీసు ఇప్పించారని ఆయన అన్నారు. ఇదే జరిగితే రైతులు రోడ్డున పడుతారని ఆయన అన్నారు.
గత టిడిపి ప్రభుత్వం హయాంలో 54 సంస్థలు మూతపడడమో, ప్రైవేట్ పరం కావడం జరిగిందని ఆయన అన్నారు. గ్రీన్ ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీకి కూడా ఇంత వరకు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన హామీ రాలేదని ఆయన అన్నారు. ఢిల్లీ - ముంబై కారిడార్ విషయం తేల్చలేదని ఆయన అన్నారు. మన రాష్ట్రానికే చెందిన కేంద్ర మంత్రి ఉన్నా అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా రావడం లేదని మిథున్ రెడ్డి విమర్శించారు.
కొత్త రైల్వే జోన్ విషయమై పునర్వ్యస్థీకరణ చట్టంలో హామీ ఉన్నా దానికి అతీగతీ లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినా ప్రాజెక్టు కేవలం కాగితాలకే పరిమితమైందని ఆయన అన్నారు. ఒక్క రూపాయి కూడా టిడిపి తెచ్చుకోలేకపోతోందని ఎంపి అన్నారు.












Click it and Unblock the Notifications