ఈవీఎంలపై అనుమానాల వేళ.. ఈసీ పనితీరుపై సాయిరెడ్డి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ ఒకవంక కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా ఈ విషయంపై అనుమానాలను వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు.
దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల వీడియో ఫుటేజ్, ఫొటోలు, వీవీప్యాట్ స్లిప్పులను ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల తర్వాత ధ్వంసం చేయాలని ఈసీ ఆదేశించడం అనుమానాలను మరింత బలపరుస్తోందని చెప్పుకొచ్చారు.

ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ పనితీరును ప్రశంసించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. 2003 తర్వాత తొలిసారిగా ప్రత్యేక, విస్తృత ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ కొత్త నిబంధనల ప్రకారం- 2003 నాటి ఓటర్ల జాబితాలో లేని వ్యక్తులు తమ పేరును నమోదు చేసుకోవాలంటే, వారు పుట్టిన తేదీ, భారత పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించడం తప్పనిసరి. ఈ మార్పు అక్రమ వలసదారుల ప్రభావంపై ఉన్న ఆందోళనలను పరిష్కరించే దిశగా ముందడుగు వేసినట్లుగా భావిస్తున్నారు.
రోహింగ్యా, బంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఓటర్ల జాబితాలో ఉన్నారని ఇటీవలే ఢిల్లీ బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీని తర్వాతే ఈసీ ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టింది. 2003 నాటి ఓటర్ల జాబితాలో లేని వ్యక్తులు తమ పేరును నమోదు చేసుకోవడానికి పుట్టిన తేదీ, భారత పౌరసత్వ ధ్రువీకరణపత్రాలను సమర్పించడం తప్పనిసరి చేసింది.
ఈ ప్రక్షాళణ అనేది- ఎన్నికల సమగ్రతను కాపాడతుందని సాయిరెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం నిబద్ధతను తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ కొత్త నిబంధనలు ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంచి, ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేస్తాయని చెప్పారు.
2003 నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఓటరు జాబితాలో చేర్చిన అక్రమ వలసదారులతో సహా అనర్హుల ఓటర్లను తొలగించడంలో ఇదొక ముఖ్యమైన చర్యగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియ, ఈసీ సమగ్రతను మరింత పెంచుతుందని సాయిరెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications