రాష్ట్రపతికి ఆ వీడియోలు చూపించారా? అభాసుపాలైన చంద్రబాబు, ఢిల్లీ టూర్ పై విజయసాయి రెడ్డి సెటైర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసిపి సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుని టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో, సోషల్ మీడియాలో కాస్త మాటల దాడిని తగ్గించారు. మళ్లీ కొద్దికొద్దిగా మాటల తూటాలు సంధిస్తూ చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.

హడావుడి చేద్దామని వచ్చి అభాసుపాలైన చంద్రబాబు
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు అడుగుపెట్టగానే పులి దిగింది, సింహం దిగింది అంటూ అరువు నినాదాలు అంటూ ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబు పడిగాపులు కాసినా కేంద్ర పెద్దల అపాయింట్మెంట్లు దొరకలేదు అంటూ సెటైర్లు వేశారు. మీడియా పట్టించుకోలేదని అతని నైజం తెలియడంతో ఏ పార్టీ కూడా దరిచేరనీయలేదు అని విమర్శించారు. హడావుడి చేద్దామని వచ్చి అభాసుపాలై ఢిల్లీ నుంచి జారుకున్నాడు చంద్రబాబు అంటూ విజయ సాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు.

ఢిల్లీలో వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేయడానికి వచ్చారా?
ఇదే సమయంలో అసాంఘిక శక్తులకు చంద్రబాబు రారాజు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి, చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేయడానికి వచ్చారా? అంటూ ఎద్దేవా చేశారు. లేదా ఏపీ పరువు తీశామని చెప్పడానికి వచ్చారా అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రపతి దగ్గరకు వెళ్లిన చంద్రబాబు టిడిపి నేత పట్టాభి బూతుపురాణం వీడియోను రాష్ట్రపతికి చూపించారా? అంటూ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి అమిత్ షా మీద రాళ్ళు వేసిన వీడియోను చూపించారా ?అంటూ ప్రశ్నించారు.

గంజాయి సాగుపై అప్పటి మంత్రి గంటా ఏం చెప్పారో వీడియో చూడు
గంజాయి వ్యాపారంలో లోకేష్ కు భాగస్వామ్యం ఉందని ప్రజలందరికీ తెలుసు అన్న విజయసాయిరెడ్డి ఏపీ ప్రభుత్వంపై డ్రగ్స్ బురద చల్లడానికి ఢిల్లీ కేంద్రంగా శతవిధాలా చంద్రబాబు ప్రయత్నించాడని నిప్పులు చెరిగారు. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేత పట్టాభి తో తిట్టించారని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పట్టాభి వ్యాఖ్యలపై సహజంగానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర పరువును చంద్రబాబు దిగజారుస్తున్నాడని విజయ సాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డ్రగ్స్ వ్యాపారం చేసింది చంద్రబాబు,లోకేష్ లే అంటూ విజయ సాయి రెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయాంలో గంజాయి సాగుపై అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం చెప్పారో వీడియో ఉందని ఆ వీడియో ని వినాలని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు

ఢిల్లీ వచ్చి అమిత్ షా పై రాళ్ళు వేయించిన వీడియో చూపించాడా?
చంద్రబాబు నాయుడు ఒక టెర్రరిస్టు అని మండిపడ్డారు. టెర్రరిస్ట్ ముఠాకు చంద్రబాబు నాయకుడని పేర్కొన్న విజయసాయిరెడ్డి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఢిల్లీ వచ్చి అమిత్ షా పై రాళ్ళు వేయించిన వీడియో చూపించాడా? అంటూ ప్రశ్నించారు. మహానాడులో ఆర్టికల్ 356 రద్దుపై తీర్మానం చేశారు. ఇప్పుడు అదే ఆర్టికల్ 356 కావాలని చంద్రబాబు కోరుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పట్టాభి బూతులను సమర్థించడానికి 36 గంటల పాటు బూతు దీక్ష చేశారని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు టూర్ ఫెయిల్ అయ్యిందని ఆయన తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications